బీసీ కుల సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు : మంత్రి పొన్నం ప్రభాకర్

by Aamani |
బీసీ కుల సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ,హుస్నాబాద్ : విజయాలను చేకూర్చే విజయదశమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని విజయదశమి సందర్భంగా ప్రజల చేత ట్రాఫిక్ రూల్స్ పై స్వీయ ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మద్యం తాగి వాహనాలు నడపరాదని మన ప్రాణాలను రక్షించుకోవడం తో పాటు ఇతరులకు అపాయం కలగకుండా చూడాలని తెలిపారు. అలాగే క్యాంపు కార్యాలయంలో షమీ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.... విజయదశమి అందరి జీవితాల్లో విజయాలు చేకూర్చాలని విద్య, వైద్యం, వ్యవసాయం తో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.


జీవో 18 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సర్వే చేయడానికి శుక్రవారం జీవో విడుదల చేసిందని గుర్తు చేశారు. బలహీన వర్గాల శాఖ మంత్రిగా వారి సంక్షేమం కు సంబంధించి మేము ఎంతో మాకు అంత వాటా ప్రకారం రాహుల్ గాంధీ చెప్పినట్లు దేశానికి ఆదర్శంగా ఉండేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ 60 రోజుల పాటు సర్వే నిర్వహించనుందని వెల్లడించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ వివరాలు తెలిస్తే ఎవరి అవకాశాలు వారికి దక్కుతాయని అన్నారు. బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు సొంతంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనందున వారికి కావలసిన సమాచారాన్ని బీసీ కుల సర్వే అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. కుల గణన సర్వే ప్రారంభం అయిందని 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయగానే దామాషా ప్రకారం ఎన్నికలు జరుగుతాయని అన్నారు. దీనికి అందరూ సహకరించాలని తెలిపారు. గతంలో బతుకమ్మ కార్యక్రమాల్లో సర్పంచి ఎంపీటీసీలు ఉన్నప్పటికీ కొంత ఇబ్బంది ఉండేదని దానిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా అధికారులు స్థానిక ముఖ్యులు సెక్రటరీ స్పెషల్ ఆఫీసర్ బతుకమ్మ వేడుకల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు.

ఇక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రణాళికలు చేస్తున్నామని రైతులకు సంబంధించిన 13 రైతు వేదిక ద్వారా సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీ వేసిందని నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని అయితే పూర్తిగా ఇల్లు లేని పూరిగుడిసెలో ఉన్న వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. వైద్య పరంగా నియోజకవర్గానికి త్వరలోనే మంచి శుభవార్త రాబోతుందని గుర్తు చేశారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి వచ్చే వర్షాకాలంలోపు కాలువల నిర్మాణం పూర్తి చేసి నీరందించే బాధ్యత తీసుకుంటామన్నారు. గిరిజన తండాల్లో రోడ్లు నిర్మించడానికి మిగతా నియోజకవర్గాల కంటే ముందే బాధ్యత తీసుకుంటామని ఇంకా ఏమైనా సమస్యలు నియోజకవర్గంలో ఉన్నట్లయితే దృష్టికి తీసుకురావాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed