Foreign Reserves: వరుసగా ఆరోవారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు ఫారెక్స్ నిల్వలు

by S Gopi |
Foreign Reserves: వరుసగా ఆరోవారం ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు ఫారెక్స్ నిల్వలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఫారెక్స్ నిల్వలు సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 20వ తేదీతో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరిగి ఆల్‌టైమ్ హై 692.3 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వరుసగా ఆరో వారం భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇటీవల అమెరికా ఫెడ్ తీసుకున్న వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలు అనుకూలంగా ఉండటం, భారత ఈక్విటీల్లో నిధులు పెరగడం వంటి అంశాలు దేశ కరెన్సీ రూపాయి బలపడేందుకు దోహదపడ్డాయి. శుక్రవారం సాయంత్రానికి అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.67 వద్ద ఉంది. గడిచిన ఐదు వారాల్లో భారత ఫారెక్స్ నిల్వలు 19.3 బిలియన్ డాలర్లు పెరిగాయి. విదేశీ మారకపు మార్కెట్లో ఆర్‌బీఐ చొరవతో విదేశీ ఆస్తుల విలువ ప్రభావితమవుతుంది. అమెరికా డాలరుతో భారత కరెన్సీ రూపాయి మారకం క్షీణతను నియంత్రించేందుకు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు లిక్విడిటీ మేనేజ్‌మెంట్ ద్వారా జోక్యం చేసుకుంటోంది.

Advertisement

Next Story