ఏడేళ్లలో రెట్టింపు నాన్-పెట్రోలియం వాణిజ్యానికి భారత్-యూఏఈ ఒప్పందం!

by Harish |   ( Updated:2023-06-12 14:33:04.0  )
ఏడేళ్లలో రెట్టింపు నాన్-పెట్రోలియం వాణిజ్యానికి భారత్-యూఏఈ ఒప్పందం!
X

న్యూఢిల్లీ: 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం యేతర(నాన్-పెట్రోలియం) ద్వైపాక్షిక వాణిజ్యం పెంచేందుకు భారత్, యూఏఈ మధ్య ఒప్పందం జరిగినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందంలో పెట్రోలియంకు బదులుగా ఇతర ఉత్పత్తుల వాణిజ్యంపై దృష్టి సారించాలని నిర్ణయించాం. తద్వారా వచ్చే ఏడేళ్లలో దీన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యం నిర్దేశించినట్టు ఆయన వెల్లడించారు.

సోమవారం సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై జరిగిన సమావేశంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పలు కీలక అంశాలను పేర్కొన్నారు. విలువ ఆధారిత బంగారం, బంగారం ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచేందుకు భారత్, యూఏఈల మధ్య అవకాశాలను పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించి తగిన సమయంలో నిర్ణయాలను ప్రకటిస్తామని చెప్పారు.

స్విట్జర్లాండ్ తర్వాత భారత్‌కు బంగారాన్ని సరఫరా చేసే ప్రధాన దేశాల్లో యూఏఈ ఒకటని గోయల్ అన్నారు. యూఏఈతో బంగారం వ్యాపారానికి మరింత ప్రోత్సాహం అవసరమని భారత్ భావిస్తోంది. తాజా ఒప్పందం ద్వారా యూఏఈ నుంచి బంగారం దిగుమతులపై భారత్ కొన్ని సుంకం రాయితీలను ఇచ్చింది. ఆ రాయితీలను అమలు చేయడంలో ఉన్న సమస్యలు పరిష్కరించాం.

ఏడాదికి 200 టన్నుల వరకు బంగారం దిగుమతులపై రాయితీకి భారత్ అంగీకరించింది. సాధారణంగా బంగారంపై దిగుమతి సుంకం 15 శాతం ఉంది. ఈ ఏడాది యూఏఈ ఎగుమతిదారులు నిర్దేశించిన బంగారాన్ని రవాణా చేస్తారని భారత్ భావిస్తోంది. తద్వారా భారతీయ బంగారం ఆభరణాల రంగం సుంకం ప్రయోజనాన్ని పొందుతుందని గోయల్ వెల్లడించారు.

Advertisement

Next Story