2036 నాటికి ఉన్నత-మధ్య ఆదాయ దేశాల క్లబ్‌లో భారత్

by S Gopi |
2036 నాటికి ఉన్నత-మధ్య ఆదాయ దేశాల క్లబ్‌లో భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2035-36 ఆర్థిక సంవత్సరం నాటికి ఉన్న-మధ్య ఆదాయ దేశాల క్లబ్‌లో భారత్ చేరనుందని ప్రముఖ పరిశోధనా సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. అలాగే, 2047 నాటికి 15 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించనుందని సోమవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ఓ సమావేశంలో మాట్లాడుతూ, 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారుతుందని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి 2046-47 వరకు భారత్ ప్రతి ఏటా 9.7 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుందని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో కొనసాగుతున్న సంక్లిష్టతలను పరిశీలిస్తే ఇది అసాధ్యంగా తోస్తుందని పేర్కొంది. ప్రపంచ, దేశీయ స్థూల ఆర్థిక పరిణామాలు ఎలా సాగుతున్నాయనే దానిపై ఆధారపడి అనుకున్న లక్ష్యం సాధించగలమో లేదో తేలుతుందని వెల్లడించింది.

ఇటీవలే మరో రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో.. భారత్‌లో పెరుగుతున్న ప్రైవేట్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం, కొనసాగుతున్న సంస్కరణలు, డిజిటలైజేషన్ వంటి అంశాల ఆధారంగా ఎగువ మధ్య-ఆదాయ దేశంగా మారుతుందని, ఆర్థికవ్యవస్థ దాదాపు 7 ట్రిలియన్ డాలర్లకు రెట్టింపు కాగలదని వెల్లడించింది. 2006 వరకు ప్రపంచ బ్యాంకు భారత్‌ను తక్కువ-ఆదాయ దేశాల జాబితాలో ఉంచింది. 2007లో భారత్ దిగువ-మధ్య ఆదాయ దేశంగా మారింది. అప్పటినుంచి అక్కడే ఉంది. 2022లో దేశ తలసరి జీడీపీ సుమారు రూ. 1,97,746గా ఉందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం భారత్ బలమైన వృద్ధిని కనబరుస్తోంది. అయితే, ప్రపంచ డిమాండ్, వాణిజ్య మద్దతు లేకుండా ఏ పెద్ద ఆర్థికవ్యవస్థ కూడా స్థిరమైన 7 శాతం వార్షిక వృద్ధిని సాధించలేకపోయిందని ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

Advertisement

Next Story