Coal: FY24లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి

by Harish |   ( Updated:2024-07-31 13:04:23.0  )
Coal: FY24లో 997 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్ 2024 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 997.828 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జులై 31న లోక్‌సభలో తెలిపారు. ఎఫ్‌వై23లో నమోదైన దానితో పోలిస్తే, ఇది 11.71 శాతం ఎక్కువ కావడం గమనార్హం. అలాగే, ఎఫ్‌వై25 మొదటి త్రైమాసికంలో 247.396 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, గత ఏడాది ఇదే కాలంలో 223.376 మి.టన్నులతో పోలిస్తే, దాదాపు 10.75 శాతం వృద్ధిని నమోదు చేసింది. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బొగ్గు దిగుమతులను క్రమంగా తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటూ, దేశీయంగా ఉత్పత్తిని పెంచుతున్నామని తెలిపారు.

బొగ్గు గనుల కార్యకలాపాలను వేగవంతం చేయడానికి సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్ ఏర్పాటు చేశామని, ఇది వార్షిక ఉత్పత్తిని పెంచడంలో కూడా సహాయపడిందని ఆయన అన్నారు. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న బొగ్గులో విద్యుత్ అవసరాలకు పోగా మిగిలిన దానిని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ సంస్థ కోల్ ఇండియా తన బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి సాధ్యమైన చోట మెరుగైన సాంకేతికతను అవలంబిస్తోంది. దేశీయ అవసరాలకే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉత్పత్తిని పెంచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కిషన్ రెడ్డి లోక్‌సభకు తెలియజేశారు.

Advertisement

Next Story