గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీ పెట్టుబడులు ప్రకటించిన అంబానీ, అదానీ!

by Harish |
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీ పెట్టుబడులు ప్రకటించిన అంబానీ, అదానీ!
X

వైజాగ్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో శుక్రవారం ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్) మొదటి రోజున భారీ పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అధిక ప్రాధాన్యత లభించడం విశేషం. మొత్తంగా దాదాపు రూ. 11.87 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 3.92 లక్షల ఉద్యోగావకాశాల కోసం 92 అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ) సంతకాలు జరిగినట్లు తెలుస్తోంది.

ప్రధానంగా దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు ఎక్కువ పెట్టుబడులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని అదానీ గ్రూప్ తెలిపింది. అందులో విశాఖలో 400 మెగావాట్ల డేటా సెంటర్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.

ఇక, ముఖేశ్ అంబానీ ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును ప్రకటించారు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్‌టీపీసీ రూ. 2.35 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందం చేసుకోగా, ఏబీసీ లిమిటెడ్ రూ. 1.2 లక్షల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ కంపెనీ రూ. 50,632 కోట్ల భారీ పెట్టుబడులను ప్రకటించాయి. అదేవిధంగా ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 9,300 కోట్లు, జిందాల్ స్టీల్ రూ.7,500 కొట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

Advertisement

Next Story