235 శాతం పెరిగిన నగదు లావాదేవీలు!

by Harish |
235 శాతం పెరిగిన నగదు లావాదేవీలు!
X

న్యూఢిల్లీ: డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మారాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశంలోని ప్రజలు మాత్రం నగదు వినియోగానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. తాజాగా బ్యాంకుల ఏటీఎం సెంటర్లకు నగదు నింపే లాజిస్టిక్, టెక్ సేవల కంపెనీ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్ సంస్థ రూపొందించిన 'ఇండియా క్యాష్ వైబ్రెన్సీ రిపోర్ట్-2023' నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

నివేదిక ప్రకారం, నోట్ల రద్దు తర్వాత 76 నెలల కాలంలో 2023, మార్చి నాటికి నోట్ల లావాదేవీలు 235 శాతం పెరిగి రూ. 2.84 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 2016లో నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత డిసెంబర్‌లో ఏటీఎం సెంటర్ల నుంచి నగదు విత్‌డ్రా విలువ రూ. 84,934 కోట్లుగా నమోదైంది. ఇది ఈ ఏడాది మార్చి నాటికి రూ. 2.84 లక్షల కోట్లకు పెరిగింది.

నోట్ల రద్దు సమయంలో నగదు చలామణి తగ్గినప్పటికీ ఆ తర్వాత అంతే వేగంగా పెరిగింది. 2016, అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా నగదు చలామణి విలువ రూ. 17.78 లక్షల కోట్లు ఉండగా, డిసెంబర్ నాటికి రూ. 9.43 లక్షల కోట్లు తగ్గింది. ఇది 2023, మార్చికి రూ. 33.8 లక్షల కోట్లకు పెరిగింది. ఇక, నగదును ఎక్కువగా ఏటీఎంల నుంచి తీసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ఏటీఎంలలో నగదు నింపే ఈ రాష్ట్రాల వాటాయే 43.1 శాతమని నివేదిక వెల్లడించింది.

Advertisement

Next Story