BSNL: ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు.. రూ.5,371 కోట్లకు తగ్గిన BSNL నష్టాలు

by Harish |
BSNL: ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు.. రూ.5,371 కోట్లకు తగ్గిన BSNL నష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలికాం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నష్టాలు 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.5,371 కోట్లకు తగ్గాయని బుధవారం లోక్‌సభలో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.8,161 కోట్లుగా నమోదైంది. వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ముందు (ఎబిటా) ఆదాయాలు ఎఫ్‌వై24లో రూ. 2,164 కోట్లకు పెరగ్గా, ఇది ఏడాది క్రితం కంటే 38.8 శాతం ఎక్కువ అని పార్లమెంట్‌లో మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్యాకేజీలు, చర్యల ఫలితంగా, 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి BSNL/MTNL నిర్వహణ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి. ఆత్మనిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా, బీఎస్‌ఎన్ఎల్ దేశీయ 4G సాంకేతికత విస్తరణ కోసం 1 లక్ష 4G సైట్‌ల కోసం కొనుగోలు ఆర్డర్‌ పెట్టాం, ఈ పరికరాలు 5Gకి కూడా అప్‌గ్రేడ్ అయ్యే విధంగా ఉంటాయని మంత్రి చెప్పారు.

BSNLలో చొరబాటు, డేటా ఉల్లంఘనలపై మాట్లాడిన మంత్రి, దీనిపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. BSNL/MTNL పునరుద్ధరణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది, దీనికోసం 2019లో, దాదాపు రూ. 69,000 కోట్లు, 2022 లో దాదాపు రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని అందించాం. 2023లో, మొత్తం రూ.89,000 కోట్లతో BSNLకి 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపును ఆమోదించామని ప్రముఖంగా ప్రస్తావించారు.



Next Story