రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల కోసం అత్యధిక బిడ్ వేసిన హిందూజా గ్రూప్!

by Harish |   ( Updated:2023-04-26 16:54:54.0  )
రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల కోసం అత్యధిక బిడ్ వేసిన హిందూజా గ్రూప్!
X

ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ ఆస్తులపై రెండో రౌండ్ వేలంలో హిందూజా గ్రుప్ సంస్థ అత్యధిక బిడ్డర్‌గా నిలిచింది. కంపెనీని స్వాధీనం చేసుకునేందుకు బుధవారం జరిగిన వేలంలో హిందూజా గ్రూప్ రూ. 9,650 కోట్లను ఆఫర్ చేసింది. ఇప్పటికీ రూ. 13,000 కోట్ల లిక్విడేషన్ విలువ కంటే ఇది చాలా తక్కువ. గతేడాది డిసెంబర్‌లో జరిగిన తొలి రౌండ్ వేలంలో రూ.8,640 కోట్లతో టోరెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అధిక బిడ్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే, రెండో రౌండ్ వేలంలో టొరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఓక్‌ట్రీ సంస్థలు పాల్గొనలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై హిందూజా గ్రూప్ ఇంకా స్పందించాల్సి ఉంది.

కమిటీ ఆఫ్ క్రెడిటర్స్(సీఓసీ) మొదటి రౌండ్‌కు కనీస బిడ్ మొత్తాన్ని రూ. 9,500 కోట్లు, రెండో రౌండ్‌కు రూ. 10 వేల కోట్లు, తదుపరి రౌండ్‌లకు అదనంగా రూ. 250 కోట్లు కేటాయించింది. అన్ని బిడ్‌లకు కనీసం రూ. 8 వేల కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీఓసీ షరతు విధించింది. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్ట మొత్తాన్ని రికవరీ చేయడానికి ఆర్థిక సంస్థలు పొడిగించిన గడువు మేరకు సుప్రీంకోర్టు అనుమతి తర్వాత బుధవారం రెండో రౌండ్ వేలం జరిగింది.

Advertisement

Next Story