Health Insurance: రూ. 15 వేల కోట్ల క్లెయిమ్‌లను తిరస్కరించిన ఆరోగ్య బీమా సంస్థలు

by S Gopi |
Health Insurance: రూ. 15 వేల కోట్ల క్లెయిమ్‌లను తిరస్కరించిన ఆరోగ్య బీమా సంస్థలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాది బీమా రంగ సంస్థలు ప్రతి 10 మందిలో ఎనిమిది మంది పాలసీదారులకు ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను సెటిల్ చేశారని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ వెల్లడించింది. తాజగా ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన డేటా ప్రకారం, ఆరోగ్య బీమా సంస్థలు రూ. 15,100 కోట్ల విలువైన క్లెయిమ్‌లను తిరస్కరించాయి. ఇది మొత్తం క్లెయిమ్‌లలో 12.9 శాతానికి సమానం. ఆరోగ్య బీమా సంస్థల కింద మొత్తం రూ. 1.17 లక్షల కోట్ల క్లెయిమ్‌లు దాఖలు కాగా, వాటిలో కేవలం రూ. 83,493 కోట్లు అంటే విలువ పరంగా 71.3 శాతానికి సమానమైన క్లెయిమ్‌లను కంపెనీలు చెల్లించాయి. సంఖ్యా పరంగా 3 కోట్ల క్లెయిమ్‌లలో 2.7 కోట్లను పరిష్కరించాయి. అంతకుముందు సంవత్సరాల నుంచి ఉన్న 17.9 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 6,290 కోట్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. 2023-24లో బీమా కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్ల ఆరోగ్య బీమా ప్రీమియంలను వసూలు చేశాయి. ఇందులో ప్రభుత్వ రంగ బీమా సంస్థలు అత్యధికంగా రూ. 40,993 కోట్లను వసూలు చేశాయి. ప్రైవేట్ కంపెనీలు రూ. 34,503 కోట్లను, స్వతంత్ర హెల్త్ ఇన్సూరేన్స్ కంపెనీలు రూ. 32,180 కోట్లను వసూలు చేశాయి. ఇక, ఈ ఏడాదిలో ఆరోగ్య బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మెన్‌కు 34,336 ఫిర్యాదులు అందాయి. ఇదివరకే వచ్చిన 2,846 ఫిర్యాదులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అత్యధికంగా ముంబై, పూణె, అహ్మదాబాద్, చండీగఢ్‌ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ఐఆర్‌డీఏ వెల్లడించింది.

Advertisement

Next Story