Companies Law: కంపెనీల చట్టం కింద పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు: నిర్మలా సీతారామన్

by S Gopi |
Companies Law: కంపెనీల చట్టం కింద పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కంపెనీల చట్టం కింద ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) ప్రాసిక్యూషన్ దశలో ఉన్న వాటిని విత్‌డ్రా చేసుకోవడం, రాజీ కుదిర్చడం వంటి చర్యలను తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ప్రవేశపెట్టే కార్యక్రమం అనంతరం ఆర్థిక మంత్రి తెలిపారు. 2017లో నిర్వహించిన మొదటి స్పెషల్ డ్రైవ్‌లో 14,247 ప్రాసెక్యూషన్‌లు విత్‌డ్రా అయ్యాయని, 2023లో జరిగిన రెండో స్పెషల్ డ్రైవ్‌లో 7,338 కేసులలో రాజీ కుదిర్చినట్టు చెప్పారు. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 15 వరకు విత్‌డ్రా కోసం 6,294 దరఖాస్తులను వివిధ కోర్టుల్లో ఉన్నాయి. అయితే, తీవ్రమైన, రాజీకి అవకాశం లేని కేసులు మాత్రమే కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు. వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణ దశలోని కేసులను సమీక్షించేందుకు ఎంసీఏ ప్రక్రియను కొనసాగిస్తోంది. విధానపరమైన, సాంకేతికంగా పరిష్కారమయ్యే వాటి భారాన్ని కోర్టులపై పడకుండా చేయడమే ఈ చర్యల లక్ష్యమని మంత్రి వివరించారు.

Advertisement

Next Story