వంటనూనె ధరల తగ్గించాలని ఆయిల్ కంపెనీలను కోరిన కేంద్రం!

by Vinod kumar |
వంటనూనె ధరల తగ్గించాలని ఆయిల్ కంపెనీలను కోరిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా వంటనూనె ధరలను తగ్గించి వినియోగదారులకు ప్రయోజనాలు అందించాలని ఎడిబుల్ ఆయిల్ కంపెనీలను కేంద్రం కోరింది. గురువారం పరిశ్రమ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన వంటనూనె ధరల ప్రయోజనాలను వినియోగదారులకు త్వరితగతిన అందించాలన్నారు. వంటనూనె అసోసియేషన్లు తక్షణమే తమ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని, ఎంఆర్‌పీ ధరలు తగ్గేలా చూడాలన్నారు. దిగుమతి చేసుకున్న వంటనూనెల అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టాయని, ఇది దేశీయ నూనె పరిశ్రమకు సానుకూల పరిణామమని ఆహర మంత్రిత్వ శాఖ తెలిపింది.

గత రెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటనూనె ధరలు టన్నుకు 200-250 డాలర్లు తగ్గాయి. అయితే, రిటైల్ మార్కెట్లో ధరల సవరణకు సమయం పడుతోంది. త్వరలో రిటైల్ ధరలు కూడా తగ్గుతాయని భావిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గురువారం ప్యాక్ చేసిన వేరుశెనగ నూనె కిలో రూ. 189.13 ఉండగా, ఆవనూనె రూ. 150.84, వనస్పతి రూ.132.62, సోయాబీన్ నూనె రూ. 138.2, సన్‌ఫ్లవర్ నూనె రూ. 145.18, పామాయిల్ రూ. 110.05 గా ఉంది.

కాగా, అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించడం వంటి కారణాలతో ధరలు దిగొస్తున్నాయి. దేశీయంగా వంటనూనె అవసరాల్లో మనం 50 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. 2021-22 ఏడాదిలో దేశీయ వంటనూనె దిగుమతుల బిల్లు 34 శాతం పెరిగి రూ. 1.57 లక్షల కోట్ల చేరుకుంది. వాల్యూమ్ పరంగా 6.85 శాతం పెరిగి 140.3 లక్షల టన్నులకు పెరిగింది.

Advertisement

Next Story