బడ్జెట్‌లో ఉపాధి కల్పించే ప్రకటనలకు అవకాశం

by S Gopi |
బడ్జెట్‌లో ఉపాధి కల్పించే ప్రకటనలకు అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌లో ఉపాధి కల్పించే పథకాలపై దృష్టి పెట్టవచ్చు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టదు. కాబట్టి గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను ప్రభుత్వం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ప్రారంభించిన స్వావలంబన భారత ఉపాధి పథకం కింద రాబోయే రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రూ. 6,000 కోట్లను కేటాయించింది. ఈ పథకం కింద 5 లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో లాక్‌డౌన్ వల్ల కోల్పోయిన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కేంద్రం స్వావలంబన భారత ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయపడింది.

ఇది కాకుండా దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, ఉపాధిని కల్పించేందుకు ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పీఎల్ఐ పథకాన్ని మరికొన్ని రంగాలకు విస్తరించవచ్చు. ముఖ్యంగా ఉపాధి అవకాశాలను పెంచే గార్మెంట్, ఆభరణాలు, హస్తకళ వంటి రంగాలకు ఉత్పత్తి ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐ) అందించవచ్చు. ప్రస్తుతం ఈ పథకం 14 రంగాలకు అందుబాటులో ఉంది. కానీ వీటిలో చాలా రంగాలు భారీ సంఖ్యలో ఉపాధిని సృష్టించలేవు. అందుకే లెదర్, గార్మెంట్, హస్తకళ వంటి రంగాలకు పీఎల్ఐని విస్తరించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed