భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచిన విదేశీ మదుపర్లు!

by Aamani |
భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచిన విదేశీ మదుపర్లు!
X

ముంబై: గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో అమ్మకాలకే మొగ్గు చూపిన విదేశీ మదుపర్లు 2023-24ని సానుకూలంగా ప్రారంభించాయి. ఈ నెలతో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇప్పటివరకు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 8,767 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత్‌ను అత్యుత్తమ పెట్టుబడి కేంద్రంగా విదేశీ ఇన్వెస్టర్లు భావిస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.

అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో భారత ఈక్విటీ మార్కెట్ల వాల్యూయేషన్ ప్రీమియం దశ నుంచి దిగిరావడంతో ఎఫ్‌పీఐలు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. అయితే, ఇటీవలి అమెరికా ఫెడ్ మినిట్స్ నివేదిక రాబోయే పాలసీ సమావేశంలో యూఎస్ 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని సంకేతమిచ్చింది. దానివల్ల ఎఫ్‌పీఐ ధోరణి అస్థిరంగా ఉండోచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు రూ. 8,767 కోట్లను భారత ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ల నుంచి రూ. 1,085 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. విదేశీ పెట్టుబడిదారులు ముఖ్యంగా కేపిటల్ గూడ్స్, నిర్మాణ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో షేర్లను కొనుగోలు చేయగా, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లను విక్రయించారు.

Advertisement

Next Story