ఫిబ్రవరిలో 4.8 శాతం పెరిగిన దేశీయ విమానాల రద్దీ

by Harish |
ఫిబ్రవరిలో 4.8 శాతం పెరిగిన దేశీయ విమానాల రద్దీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఫిబ్రవరి నెలలో దేశీయ విమానాల రద్దీ సంవత్సరానికి 4.8 శాతం పెరిగి 1.26 కోట్లకు చేరుకుంది. అయితే ఇది జనవరి నెలలో 1.31కోట్లుగా నమోదైంది. మార్చి 15న ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి విడుదలైన డేటా ప్రకారం, ఫిబ్రవరిలో మొత్తం 1.55 లక్షల మంది ప్రయాణికులు విమానాల ఆలస్యంతో ప్రభావితమయ్యారు. జనవరిలో 12.2 శాతంగా ఉన్న ఎయిర్ ఇండియా మార్కెట్ వాటా ఫిబ్రవరిలో 12.8 శాతానికి పెరిగింది. ఇండిగో వాటా 60.2 శాతం నుండి స్వల్పంగా 60.1 శాతానికి పడిపోయింది.

దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఫిబ్రవరిలో 76.02 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియాలో 16.17 లక్షల మంది ప్రయాణించారు. విస్తారాలో 12.55 లక్షల మంది, ఎయిర్ ఏషియా ఇండియా(AIX కనెక్ట్)లో 7.68 లక్షల మంది ప్రయాణించారు. అకాసా ఎయిర్ ఫిబ్రవరిలో 5.68 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్లింది.

ఎయిర్ ఏషియా ఇండియా(AIX కనెక్ట్) అత్యుత్తమ ఎయిర్‌లైన్‌గా నిలిచింది. డేటా ప్రకారం, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాల్లో AIX కనెక్ట్ 73.5 శాతం మంచి పనితీరును సాధించింది. ఆ తరువాత రెండో స్థానంలో అకాసా ఎయిర్, మూడో స్థానంలో ఇండిగో, నాలుగో స్థానంలో విస్తారా ఉన్నాయి.

డిసెంబర్, జనవరి నెలల్లో పొగమంచు కారణంగా విమానాలు కొంత ఆలస్యంగా నడిచినప్పటికీ ఆ తర్వాత నుంచి వాటి సమయపాలన 2-5 శాతం పెరిగింది. ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసిన దేశీయ విమానయాన సంస్థల మొత్తం రద్దు రేటు 0.90 శాతంగా ఉంది. వీటిలో వాతావరణ సమస్యల కారణంగా రద్దైన విమానాల వాటా 58.6 శాతం, సాంకేతిక సమస్యల కారణంగా 19.7 శాతం విమానాలు రద్దయ్యాయి.

DGCA డేటా ప్రకారం, ఫిబ్రవరిలో బోర్డింగ్ ఆలస్యం వల్ల 917 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. వారికి పరిహారం, సౌకర్యాల కోసం విమానయాన సంస్థలు రూ.78.19 లక్షలు ఖర్చు చేశాయి. విమానాలు రద్దు చేయడం ద్వారా ఫిబ్రవరిలో 29,143 మంది ప్రయాణికులు ప్రభావితం కాగా, వారికి నష్టపరిహారం, ఇతర సౌకర్యాల కోసం రూ.99.96 లక్షలు ఖర్చు చేశారు.

Advertisement

Next Story

Most Viewed