- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US Elections: ట్రంప్ వర్సెస్ కమలా.. భారత మార్కెట్లకు బూస్ట్ ఇచ్చేదెవరు?
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అందరి చూపు అమెరికా అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది. ఈ వారంలో ఎవరు గెలవనున్నారనే విషయం తెలుస్తుంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం ప్రపంచ ఆర్థిక మార్కెట్లు ఇప్పటికే సన్నాహాలు చేసినట్టు విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరు గెలిస్తే భారత మార్కెట్లకు ప్రయోజనాలు ఉంటాయనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే ప్రధానంగా భారతీయ ఆటో, ఎనర్జీ, మెటల్ రంగాలకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఫార్మాస్యూటికల్ రంగానికి మోస్తరు సానుకూలత ఉండొచ్చు. వాణిజ్య పరంగా భారత సరుకుల ఎగుమతుల్లో 18 శాతం వాటా అమెరికాదే. మన దేశం నుంచి ఎక్కువగా ఎలక్ట్రానిక్స్, ముత్యాలు-ఇతర విలువైన రాళ్లు, ఫార్మా, న్యూక్లియర్ రియాక్టర్లు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇనుము, ఉక్కు, వాహనాలు, దుస్తులు ఎగుమతి అవుతాయి. అంతేకాకుండా ప్రపంచ అగ్రశ్రేణి సేవల ఎగుమతుల్లోనూ భారత్ కీలకమైన దేశం. ఐటీ, ప్రొఫెషనల్ సేవల వంటి వాటిని అమెరికా ఎక్కువగా పొందుతోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే అధిక దిగుమతుల ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ డివిరె గ్రూప్ సీఈఓ నిగెల్ గ్రీన్ చెప్పారు. దానివల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతో పాటు ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేసేందుకు యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపుల విషయంలో దూకుడుగా వెళ్లకపోవచ్చన్నారు.
ఇప్పటికే ట్రంప్ వాణిజ్య విధానాలపై అవగాహన ఉన్న పెట్టుబడిదారులు డాలర్ పెరుగుదలపై ఎక్కువ ఆశలు పెంచుకుంటున్నారు. తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకుంటున్నారు. బలమైన డాలర్ మారకం, అధిక ద్రవ్యోల్బణం వల్ల తక్కువ స్థాయిలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలను పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నారని నిగెల్ గ్రీన్ వివరించారు. ట్రంప్ గెలిస్తే, ఆయన ప్రతిపాదించిన 10 శాతం బ్లాంకెట్ ఇంపోర్ట్ టారిఫ్, చైనా దిగుమతులపై 60 శాతం సుంకం వల్ల అమెరికా ఆదాయాన్ని 8 శాతం వరకు తగ్గించవచ్చు. తద్వారా ప్రపంచ వాణిజ్యంపై కూడా గణనీయమైన ప్రభావం ఉండనుంది. ఒకవేళ కమలా హ్యారిస్ గెలిస్తే, ఆమె విధానాల ప్రకారం.. ఫెడ్ లక్ష్యం 2 శాతానికి ద్రవ్యోల్బణం క్షీణించనుంది. వడ్డీ రేట్ల తగ్గింపు 2025లోనూ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్ పనితీరు..
అయితే, ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రస్తుతం జో బిడెన్ పాలనలోనూ అమెరికాతో పాటు భారత ఈక్విటీలు రాణించాయి. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం.. ట్రంప్ 1.0 హయాంలో ఎస్అండ్‌పీ 500 70.2 శాతం, నాస్దాక్ 142.9 శాతం పెరిగాయి. బిడెన్ పాలనలో ఎస్అండ్‌పీ 50.8 శాతం, నాస్దాక్ 36.8 శాతం లాభపడ్డాయి. ట్రంప్ ఉన్నప్పుడు మన సూచీలు సెన్సెక్స్ 82.3 శాతం, నిఫ్టీ 73.6 శాతం పెరిగాయి. బిడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సెన్సెక్స్ 59 శాతం, నిఫ్టీ 64.5 శాతం పుంజుకున్నాయి.
కమలా హ్యారీస్ తటస్థ వైఖరి కారణంగా అమెరికా ఆర్థికవ్యవస్థ, ఈక్విటీలు, ఇతర రంగాలు ఇప్పుడున్న ధోరణిలోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు డీ-గ్లోబలైజేషన్ పద్దతి వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఈక్విటీలు, కరెన్సీపై ట్రంప్ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కీలకమైన భారత్‌కు దీర్ఘకాలంలో సానుకూలత ఉంటుందని ఆశిస్తున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. కమలా హ్యారిస్ పార్టీ ప్రతిపాదించిన కార్పొరేట్ పన్ను పెంపు, కఠిన యాంటీట్రస్ట్ చట్టాల వల్ల అమెరికా ఈక్విటీలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్ఎస్‌బీసీ అభిప్రాయపడింది. ముఖ్యంగా పెద్ద టెక్, ఏఐ రంగాలపై నియంత్రణ విధానాల వల్ల అనిశ్చితి ఏర్పడి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయవచ్చు.
మొత్తం దేశీయ, విదేశాంగ విధానాలపై ట్రంప్ 2.0 ద్వారా అత్యంత సానుకూలంగా ప్రభావితమయ్యే దేశాల్లో ఇజ్రాయెల్, రష్యా, సౌదీ అరేబియా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. చైనా, ఇరాన్, మెక్సికో, ఉక్రెయిన్ దేశాలకు అత్యంత ప్రతికూలంగా ఉండవచ్చని నిపుణులు వెల్లడించారు.