522 పాయింట్లు పతనమైన సెన్సెక్స్! రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి

by Harish |   ( Updated:2023-10-25 12:12:18.0  )
522 పాయింట్లు పతనమైన సెన్సెక్స్! రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరి
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో వరుస నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం సెషన్‌లో ఉదయం నుంచే బలహీనంగా ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు రోజంతా అధిక నష్టాల్లోనే ర్యాలీ చేశాయి. ఇజ్రాయెల్, హామాస్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ప్రతికూల వాతావరణమే మార్కెట్లకు పతనానికి ప్రధాన కారణమైంది.

దీనికితోడు గాజాపై యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ చెప్పడం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందని మార్కెట్లు అంచనా వేయడం, అమెరికా బాండ్ల రాబడి, ముడి చమురు ధరలు పెరగడం, బంగారం కొనుగోళ్లు ఊపందుకోవడం వంటి పరిణామాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదవ సెషన్‌లో దెబ్బతిన్నాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 522.82 పాయింట్లు పతనమై 64,049 వద్ద, నిఫ్టీ 159.60 పాయింట్లు క్షీణించి 19,122 వద్ద ముగిశాయి. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ మినహా అన్ని రంగాలు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, ఎస్‌బీఐ, మారుతీ సుజుకి, ఎంఅండ్ఎం, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి.

ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.16 వద్ద ఉంది.

ఈ నేపథ్యంలోనే వరుస నష్టాల కారణంగా మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం ఒక్కరోజే రూ.7.30 లక్షల కోట్లను కోల్పోయింది. అలాగే, గడిచిన ఐదు సెషన్లలో దాదాపు రూ.15 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

Advertisement

Next Story