వంటనూనె దిగుమతి పన్నులపై రాయితీ మరో ఆరు నెలలు పొడిగింపు!

by Seetharam |
వంటనూనె దిగుమతి పన్నులపై రాయితీ మరో ఆరు నెలలు పొడిగింపు!
X

న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెంచుతూ, ధరలను అదుపులో ఉంచేందుకు ఎంపిక చేసిన వంటనూనె దిగుమతి పన్నులపై రాయితీలను 2023, మార్చి వరకు కొనసాగిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ ఆదివారం ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, దీనివల్ల దేశీయంగా ధరలు నెమ్మదిస్తున్నాయని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. వీటితో పాటు సుంకాలపై రాయితీ కారణంగా భారత్‌లో వంటనూనె ధరలు దిగొస్తున్నాయి.

తాజాగా వంటనూనె దిగుమతులపై సుంకం రాయితీలను మరో ఆరు నెలలు పొడిగించడం వల్ల ముడి పామాయిల్, రిఫైన్‌డ్ పామాయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్‌డ్ పొద్దుతిరుగుడు నూనె, ముడి సోయాబీన్ నూనె, రిఫైన్‌డ్ సోయాబీన్ నూనెలపై ఇప్పుడున్న దిగుమతి సుంకాలే కొనసాగనున్నాయి. ప్రస్తుతానికి వీటిపై సుంకం లేదు. కానీ, వ్యవసాయ, సామాజిక సంక్షేమం సెస్‌ల రూపంలో వీటిపై 5.5 శాతం దిగుమతి పన్ను ఉంది. అదేవిధంగా రిఫైన్‌డ్ పామాయిల్‌పై 13.75 శాతం, రిఫైన్‌డ్ సోయాబీన్, పొద్దు తిరుగుదు నూనె‌లపై 19.25 శాతం పన్ను అమలవుతోంది.

గత ఏడాది మొత్తం వంటనూనె ధరలు అధికంగా ఉండటంతో, దేశీయ లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం పలు సందర్భాల్లో పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. మన వంట నూనె అవసరాల్లో 60 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీనివల్లే దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులపై ఈ భారం తగ్గించేందుకు ప్రభుత్వం పలు దశల్లో దిగుమతి సుంకాన్ని తగ్గింది.

Advertisement

Next Story