వేగంగా పెరుగుతున్న CNG కార్ల గిరాకీ!

by sudharani |   ( Updated:2022-12-11 11:42:06.0  )
వేగంగా పెరుగుతున్న CNG కార్ల గిరాకీ!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సీఎన్‌జీ (కంప్ర‌స్‌డ్ నేచుర‌ల్ గ్యాస్‌)తో న‌డిచే కార్లకు గిరాకీ పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరలు పెరుగుతున్నప్పటికీ సీఎన్‌జీతో నడిచే ప్యాసింజర్ కార్ల అమ్మకాలు ఊపందుకుంటున్నాయని, ప్రస్తుతం దేశంలో అమ్ముడయ్యే మొత్తం కార్లలో వీటి వాటా 10 శాతానికి చేరుకుందని పరిశ్రమ చెబుతోంది. ఈ ఏడాది జనవరిలో ఇది 8 శాతంగా ఉండేది. డీజిల్, పెట్రోల్‌లతో నడిచే కార్ల కంటే తక్కువ నిర్వహణ ఖర్చు, కొత్త మోడళ్లు ఈ విభాగంలో వస్తుండటం, ఎక్కువ ప్రోత్సాహకాలు లభిస్తుందటంతో సీఎన్‌జీ కార్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతోందని మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.

సీఎన్‌జీ కార్లతో కిలోమీటర్‌కు రూ. 2.60 ఖర్చు అవుతుందని, పెట్రోల్, డీజిల్ వాటితో రూ. 5.30 నుంచి రూ. 5.45 మధ్య ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ సానుకూల పరిణామాల మధ్య సీఎన్‌జీ ధరలు తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సీఎన్‌జీ ధరలు జనవరిలో కిలోకు రూ. 78.61 నుంచి 48 శాతం పెరిగాయి. అయినప్పటికీ, సీఎన్‌జీ కార్ల రిటైల్ అమ్మకాలు జనవరిలో 22,807 యూనిట్ల నుంచి 33,529 యూనిట్లకు పెరిగాయి. గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలోని మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 1.2 శాతం, పెట్రోల్ కార్ల వాటా 70.8 శాతం, డీజిల్ కార్ల వాటా 18 శాతంగా ఉంది.

Advertisement

Next Story