నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు

by S Gopi |
నేటి నుంచే బడ్జెట్ సమావేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ 2.0 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవి లోక్‌సభ ఎన్నికల ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. రేపు(ఫిబ్రవరి 1న) కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతో పాటు మధ్యంతర బడ్జెట్‌పై చర్చించనున్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ సమావేశంలో 30 పార్టీలకు చెందిన 45 మంది పార్టీల ఫ్లోర్‌లీడర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశాన్ని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రులు నేతలకు తెలియజేశారు.

గురువారం సమర్పించే మధ్యంతర బడ్జెట్‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆరవది. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డులకు ఎక్కనున్నారు. మొరార్జీ దేశాయ్ సైతం ఐదు సమగ్ర బడ్జెట్‌లతో పాటు ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించారు. ఇప్పటికే ఐదుసార్లు పూర్తి బడ్జెట్‌ను ప్రకటించిన నిర్మలా సీతారామన్, ఈ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.

సాధారణంగా తాత్కాలిక కాలానికి సమర్పించే బడ్జెట్‌లో ప్రజలను ఆకట్టుకునే పథకాలేమీ ఉండవు. ఇప్పటికే ఆర్థిక మంత్రి సైతం పెద్ద ప్రకటనలు ఉండవని చెప్పారు. అయినప్పటికీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌లోనూ ప్రజాకర్షక ప్రకటనలు ఉంటాయని సామాన్యులు భావిస్తున్నారు. ఇక, ఎప్పటిలాగే బడ్జెట్ ప్రకటనలో ఆశించే ఆదాయ పన్ను శ్లాబ్ గురించి ఎంతో ఆశగా ఉన్నారు. ఆదాయ పన్ను పరిమితిని పెంచుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం పాత పన్నుల విధానంలో పన్ను పరిమితి రూ. రెండున్నర లక్షలు ఉండగా, కొత్త పన్ను విధానంలో రూ. 3 లక్షలుగా ఉంది. దీన్ని కనీసం రూ. 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఎన్‌పీఎస్‌ విషయానికి వస్తే, ఈ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు 75 ఏళ్లు పైబడిన చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈపీఎఫ్‌తో సమానంగా ఎన్‌పీఎస్‌లోనూ పన్ను ప్రయోజనాలు కల్పించాలనే అభ్యర్థనలు పెరిగాయి. ప్రస్తుతం పాత పన్నుల విధానంలో ఎన్‌పీఎస్‌లో జమ చేసే మొత్తంపై రూ. 50,000 వరకు రాయితీ ఉంది. 80సీ కింద లభించే రూ. లక్షన్నరకు ఇది అదనం. దీన్ని కొత్త పన్ను విధానంలోనూ అమలు చేయాలని కోరుతున్నారు.

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద గృహ రుణం చెల్లించేందుకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి రూ. 1.50 లక్షల వరకు మినహాయింపు అవకాశం ఉంది. ఇది జీవిత బీమా ప్రీమియంలు, ట్యూషన్ ఫీజులు, పీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా మిగిలిన వాటితో పాటు అందుబాటులో ఉంది. అయితే, ఇళ్ల రుణాల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మంత్రి మధ్యంతర బడ్జెట్‌లో ఇళ్ల రుణాల చెల్లింపు కోసం ప్రత్యేక మినహాయింపును ప్రవేశపెట్టాలని సామాన్యులు కోరుతున్నారు.

జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. దీన్ని 5 శాతానికి తగ్గించడం ద్వారా దేశంలో మరింత మందిని బీమా పరిధిలోకి తెచ్చేందుకు వీలవుతుందని పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్థనలు పెరిగాయి. దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేయవచ్చని అంచనా.

ఇక, ఇప్పటికే మౌలిక సదుపాయాలకు కేటాయించిన నిధులను మరింత పెంచడమే కాకుండా గ్రీన్ ఎనర్జీ, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల మద్దతుగా నిర్ణయాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story