NPS లో మార్పులు చేయనున్న కేంద్రం!

by Harish |   ( Updated:2023-06-21 16:27:03.0  )
NPS లో మార్పులు చేయనున్న కేంద్రం!
X

న్యూఢిల్లీ: జాతీయ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్)లో కీలక మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం కనీసం 40-45 శాతం పెన్షన్ పొందేందుకు వీలుగా ఎన్‌పీఎస్‌లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎన్‌పీఎస్ విధానం ద్వారా నిర్దిష్ట పెన్షన్ కోసం ఎటువంటి హామీ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి తన వంతు వాటాను చెల్లించాల్సిన పనిలేదు. ఉద్యోగ విరమణ అనంతరం ఆ సమయంలో ఉన్న జీతంలో సగం ప్రతి నెలా పెన్షన్ కింద తీసుకుంటారు. దీనివల్ల పెన్షన్ చెల్లింపుల కోసమే ప్రభుత్వం ఎక్కువ మొత్తం చెల్లిస్తోంది. అదే ఎన్‌పీఎస్ విధానమైతే ఉద్యోగి వాటా 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటాగా 14 శాతం చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం సెక్యూరిటీ, డెట్ పథకాల్లో మదుపు చేస్తోంది.

కానీ ఎన్‌పీఎస్ ద్వారా పెన్షన్ హామీ ఉండదు. అందుకే చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ విధానం కోసం డిమాండ్ వస్తోంది. పలు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్నే అమలు చేస్తామని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచించిన విధంగానే ఎన్‌పీఎస్ ఎంచుకునేవారి పదవీ విరమణ తర్వాత 40-45 శాతం పెన్షన్ పొందే హామీని ప్రతిపాదించింది.

ఇవి కూడా చదవండి : ఈ పథకాల్లో మహిళలకు అదిరిపోయే బెనిఫిట్స్

Advertisement

Next Story

Most Viewed