Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు

by S Gopi |
Stock Market: స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లో బడ్జెట్ ప్రభావం కొనసాగుతోంది. అంతకుముందు సెషన్‌లో బడ్జెట్ ప్రకటనల కారణంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో అదే ధోరణిని కొనసాగించాయి. ముఖ్యంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్అండ్ఓ) సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రతిపాదన కారణంగా మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీనికితోడు ఈక్విటీల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండటం వంటి అంశాలు ర్యాలీని ప్రభావితం చేశాయి. మిడ్-సెషన్‌కు ముందు కొంత నిలదొక్కుకునే సూచనలు కనిపించినప్పటికీ ఆఖర్లో అమ్మకాలు వరుసగా నాలుగో రోజు నష్టాలకు దారితీశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 280.16 పాయింట్లు క్షీణించి 80,148 వద్ద, నిఫ్టీ 65.55 పాయింట్ల నష్టంతో 24,413 వద్ద ముగిశాయి. నిఫ్టీలో బ్యాంకింగ్, ఫనాన్స్ రంగాలు నీరసించగా, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్, రిలయన్స్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందూస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, నెస్లె ఇండియా స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.69 వద్ద ఉంది. వరుస నష్టాల కారణంగా మదుపర్లు బుధవారం ఒక్కరోజే రూ. 3.2 లక్షల కోట్లు సంపదను కోల్పోగా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 449.6 లక్షల కోట్లకు చేరింది.

Advertisement

Next Story