డిజిటల్ రూపీ యాప్‌ను ప్రారంభించిన కెనరా బ్యాంక్!

by Harish |   ( Updated:2023-08-21 15:27:06.0  )
డిజిటల్ రూపీ యాప్‌ను ప్రారంభించిన కెనరా బ్యాంక్!
X

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ సోమవారం యూపీఐ ఇంటర్ఆపరబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. 'కెనరా డిజిటల్ రూపీ యాప్' పేరుతో దీన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఇటువంటి మొబైల్ యాప్ ఫీచర్‌ను తీసుకొచ్చిన మొదటి బ్యాంకు కెనరా బ్యాంకు కావడం విశేషం.

ఈ యాప్ ద్వారా వినియోగదారులు వ్యాపార యూపీఐ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చెసి డిజిటల్ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అలాగే, వ్యాపారులు సైతం ప్రస్తుత వారి యూపీఐ క్యూఆర్ కోడ్‌లను ఉపయోగించి డిజిటల్ కరెన్సీ చెల్లింపులను పూర్తి చేయవచ్చు. సీబీడీసీ కోసం విడిగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే యూపీఐ క్యూఆర్ కోడ్‌లను వినియోగించవచ్చని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.

యూపీఐ సహకారంతో ప్రారంభించిన కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో విప్లవాత్మక అడుగు అని బ్యాంకు ఎండీ, సీఈఓ కె సత్యనారాయణ రాజు అన్నారు. డిజిటల్ కరెన్సీతో వేగవంతమైన, సురక్షితమైన లావాదేవీ ప్రయోజనాలు ప్రజలు పొందనున్నారు. అందుకు తమ యాప్ ఉపయోగపడటం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story