బైజూస్ కార్యాలయాల్లో సోదాలపై సీఈఓ రవీంద్రన్ స్పందన!

by Vinod kumar |
బైజూస్ కార్యాలయాల్లో సోదాలపై సీఈఓ రవీంద్రన్ స్పందన!
X

బెంగళూరు: గత వారాంతం ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ కార్యాలయాలు, సీఈఓ నివాసంలో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సోదాలకు సంబంధించి కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ బైజు రవీంద్రన్ స్పందించారు. ఇతర స్టార్టప్, కంపెనీల కంటే బైజూస్ భారత్‌కు ఎక్కువ విదేశీ నిధుల(ఎఫ్‌డీఐ)ను తీసుకొచ్చిందని, దానికి అవసరమైన నిబంధనలను బైజూస్ పాటిస్తుందని ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశంలో అత్యంత విలువైన స్టార్టప్‌గా బైజూస్ ఉందన్నారు.

ఇదివరకు 22 బిలియన్ డాలర్ల విలువైన స్టార్టప్‌గా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు జనరల్ అట్లాంటిక్, సీకోయా కేపిటల్, బ్లాక్‌రాక్ వంటి కంపెనీలను ఆకర్షించిందని రవీంద్రన్ తెలిపారు. తాము ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనలను అనుసరించే కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని, అధికారులకు కూడా దీనిపై స్పష్టత వస్తుందన్నారు. కంపెనీ అంతర్జాతీయ కొనుగోళ్ల కోసం నిధులను విదేశీలకు పంపినట్టు రవీంద్రన్ పేర్కొన్నారు.

ఆ నిధులన్నీ చట్టపరమైన అన్ని నిబంధనలను పాటించినట్టు ఆయన స్పష్టం చేశారు. శనివారం బైజూస్ కార్యాలయం, రవీంద్ర ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. ఫెమా నిబంధనల ప్రకారం, కీలక పత్రాలను, డిజిటల్ డేటాను ఈడీ స్వాధీనం చేసుకుంది. కొందరు వ్యక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సోదాలు చేసినట్టు అధికారులు చెప్పారు. కాగా, ఈడీ సోదాల్లో బైజూస్ 2011-2023 మధ్య కాలంలో రూ. 9,754 కోట్ల విలువైన నిధులు ఇతర దేశాలకు బదిలీ చేసింది. అదే సమయంలో సుమారు రూ. 28 వేల కోట్ల విలువైన విదేశీ పెట్టుబడులను కూడా అందుకుంది. విదేశాలకు బదిలీ చేసిన నిధుల్లో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదు అందినట్టు ఈడీ వెల్లడించింది.

Advertisement

Next Story