Tata: అస్సాంలో టాటా సెమీకండక్టర్ ప్లాంట్‌కు భూమి పూజ

by Harish |
Tata: అస్సాంలో టాటా సెమీకండక్టర్ ప్లాంట్‌కు భూమి పూజ
X

దిశ, బిజినెస్ బ్యూరో: సెమీకండక్టర్ విభాగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు గతంలో టాటా గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగా తాజాగా అస్సాంలోని జాగీరోడ్‌లో టాటా సెమీకండక్టర్ అండ్ టెస్టింగ్ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించి శనివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, టాటా సన్స్ లిమిటెడ్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ విలువ రూ.27,000 కోట్లు. ఈ సందర్భంగా సెమీకండక్టర్ అసెంబ్లింగ్, టెస్టింగ్ సదుపాయానికి సంబంధించిన 3-డి మోడల్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ ప్లాంట్ ఏర్పాటుతో దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ అవసరాలు చాలా వరకు తీరుతాయి. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కావడానికి ఏడాది పట్ట వచ్చని తెలుస్తుంది. అధికారులు 2025 నాటికి ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో అస్సాం రూపురేఖలు మారుతాయని, ఆ ప్రాంతంలో భారీగా కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని, దాదాపు 30,000 మందికి పైగా ఉపాధి దొరుకుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఎక్స్‌లో పేర్కొన్నారు.

వైర్ బాండ్, ఫ్లిప్ చిప్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ప్యాకేజింగ్ (ISP) అనే మూడు కీలక ప్లాట్‌ఫారమ్ టెక్నాలజీలపై దృష్టి సారించి కంపెనీ దీనిని నిర్మిస్తుంది, భవిష్యత్తులో అధునాతన ప్యాకేజింగ్ టెక్నాలజీలకు రోడ్‌మ్యాప్‌ను విస్తరించే యోచనలో ఉంది. ఈ ప్లాంట్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌లచే తయారు చేయబడిన పొరలు అసెంబుల్ చేస్తారు. ఆ తరువాత వాటిని కావలసిన ఉత్పత్తిలో ఉపయోగించే ముందు టెస్టింగ్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తారు.

AI, ఇండస్ట్రియల్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి కీలకమైన మార్కెట్ విభాగాలలో పెరుగుతున్న ప్రపంచ డిమాండ్లను తీర్చటానికి టాటా సెమీకండక్టర్ ప్లాంట్ తోడ్పాటు అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఈశాన్య భారతదేశంలో పారిశ్రామికీకరణకు ప్రోత్సాహకరంగా నిలుస్తుంది. దీంతో ఈ ప్రాంతంలో రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story