వారాంతం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
వారాంతం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: వరుస సెషన్లలో లాభాలతో గరిష్ఠాల వద్ద కొనసాగుతున్న దేశీయ ఈక్విటీ మార్కెట్లకు శుక్రవారం భారీ నష్టాలు ఎదురయ్యాయి. వారాంతం రోజున సూచీలు పెద్ద ఎత్తున అమ్మకాల ఒత్తిడికి గురవడంతో కుదేలయ్యాయి. ప్రధానంగా దిగ్గజ కంపెనీల షేర్లను విక్రయించేందుకు మదుపర్లు మొగ్గు చూపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా దెబ్బతిన్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. అంచనాలను మించి నమోదవుతుండంతో వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పట్లో ఉండకపోవచ్చనే అంచనాల మధ్య గ్లోబల్ మార్కెట్లు బలహీనమయ్యాయి. దేశీయంగా రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 732.96 పాయింట్లు పతామై 73,878 వద్ద, నిఫ్టీ 172.35 పాయింట్లు నష్టపోయి 22,475 వద్ద ముగిశాయి. నిఫ్టీలో దాదాపు అన్ని రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఎల్అండ్‌టీ, మారుతీ సుజుకి, భారతీ ఎయిర్‌టెల్, నెస్లె ఇండియా, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.46 వద్ద ఉంది. సూచీల భారీ నష్టాలతో శుక్రవారం ఒక్కరోజే మదుపర్లు రూ. 2.53 లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్నారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 404.48 లక్షల కోట్లకు తగ్గింది.

Advertisement

Next Story

Most Viewed