అదానీ గ్రూప్‌కు మేమున్నామంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ!

by Harish |
అదానీ గ్రూప్‌కు మేమున్నామంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ!
X

న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ వ్యవహారం కారణంగా అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఫండ్ సంస్థలు దూరంగా ఉంటే, మరోవైపు రిటైల్ పెట్టుబడిదారులు కంపెనీల్లో కొన్న షేర్ల ధరలు పడిపోవడం చూసి ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ల వరుస పతనాలకు కారణమైన అదానీ కంపెనీలు ఏయే బ్యాంకుల నుంచి ఎంత మొత్తం రుణాలు తీసుకున్నాయో నివేదికలు బయటపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్‌నకు తాము రుణాలను కొనసాగిస్తామని బ్యాంకు సీఈఓ, ఎండీ సంజీవ్ చద్దా సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు. అయితే, తామిచ్చే రుణాలు పూచీకత్తుకు అనుగుణంగానే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అదానీ కంపెనీల షేర్ల వల్ల నెలకొన్న అస్థిర పరిస్థితులపై ఎలాంటి ఆందోళన తమకు లేదని, నిబంధనల ప్రకారం రుణాలివ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు.

ఇటీవల అదానీ గ్రూప్ రూ. 5 వేల కోట్లకు ముంబైలోని మురికివాడ ధారావి పునరుద్ధరణ ప్రాజెక్టును పొందిన సంగతి తెలిసిందే. దీనికోసం బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్స్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని సంజీవ్ చద్దా అన్నారు. అయితె, ఈ ఫైనాన్స్ పరిమితులను బట్టే ఇవ్వడం జరుగుతుందని, గ్రూప్ షేర్లలో నెలకొన్న ఒడిదుడుకులకు ప్రాధాన్యత ఇవ్వమని ఆయన వివరించారు.

ఇక, హిండెన్‌బర్గ్ ప్రభావంతో రోజురోజుకు అదానీ సంపద కరిగిపోతోంది. తాజాగా అదానీ సంపద 50 బిలియన్ డాలర్ల(రూ. 4.13 లక్షల కోట్ల)కు క్షీణించింది. దీంతో ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలీయనీర్స్ జాబితాలో అదానీ 25వ స్థానానికి పడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed