ఈ ఏడాదిలో దశాబ్ద కనిష్టానికి తగ్గనున్న భారత బ్యాంకుల నిరర్థక ఆస్తులు!

by Harish |
ఈ ఏడాదిలో దశాబ్ద కనిష్టానికి తగ్గనున్న భారత బ్యాంకుల నిరర్థక ఆస్తులు!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్‌పీఏ) దశాబ్ద కనిష్టం 3.8 శాతానికి తగ్గుతాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి కూడా ఎన్‌పీఏలు 4.2 శాతానికి తగ్గుతాయని క్రిసిల్ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో బ్యాంకుల ఎన్‌పీఏలు 5.9 శాతంగా ఉండేవి. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి ఎన్‌పీఏలు 4 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది.

అధిక-విలువ కలిగిన కార్పొరేట్ రుణాలు మెరుగుపడటమే కాకుండా కంపెనీల ముందస్తు రుణ చెల్లింపు ద్వారా ఎన్‌పీఏలు దిగొచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు సమర్థవంతమైన రిస్క్ మెనేజ్‌మెంట్ కూడా ఎన్‌పీఏలను తగ్గించడంలో బ్యాంకులకు సహాయపడనున్నట్టు క్రిసిల్ వివరించింది.

ఇటీవల యూఎస్‌లోని కొన్ని బ్యాంకులు సంక్షోభాన్ని ఎదుర్కొనడం, యూరప్‌లోని నియంత్రణ సంస్థలు బ్యాంకులను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం వంటి గ్లోబల్ పరిణామాల మధ్య భారత బ్యాంకింగ్ రంగం సవాళ్లను అధిగమించగలదని అంచనా వేస్తున్నట్టు క్రిసిల్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ బ్యాంకింగ్ రంగం మునుపటి తరహాలోనే 15 శాతం రుణ వృద్ధిని సాధించగలదని క్రిసిల్ పేర్కొంది.

Advertisement

Next Story