ఐదేళ్లలో 50 శాతానికి పైగా పెరిగిన కార్ల సగటు ధర

by S Gopi |
ఐదేళ్లలో 50 శాతానికి పైగా పెరిగిన కార్ల సగటు ధర
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రీమియమైజేషన్, మారుతున్న నిబంధనలు, వేగంగా పెరుగుతున్న ఎస్‌యూవీల కారణంగా భారత్‌లో ప్యాసింజర్ వాహనాల(పీవీ) సగటు ధర క్రమంగా పెరుగుతోంది. పరిశ్రమ నుంచి సేకరించిన డేటా ప్రకారం, 2018-19లో పీవీల సగటు ధర రూ. 7.65 లక్షలు ఉండగా, 2023-24 నాటికి ఇది రూ. 11.5 లక్షలతో 50 శాతానికి పైగా పెరిగింది. అంతేకాకుండా కార్లను కొంటున్న వినియోగదారుల సంఖ్య గతేడాది 27 శాతం నుంచి ఇప్పుడు 43 శాతానికి చేరింది. దేశంలో ఎక్కువమంది ఏ వాహనం కొనాలన్నా టాప్-ఎండ్ వేరియంట్‌నే ఎంచుకుంటున్నారు. ఇది ప్రీమియమైజేషన్‌కు జరుగుతున్న మార్పును సూచిస్తుందని మారుతీ సుజుకి ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. అలాగే, ప్రజలు తమ వాహనాల్లో ఎక్కువ ఫీచర్లను ఆశిస్తున్నారని ఆయన తెలిపారు. వాహనం సగటు ధర పెరుగుదలలో అనేక అంశాలు కీలకంగా ఉన్నాయి. విడి పరికరాల ధరలు క్రమంగా పెరుగుతుండటం అందులో ముఖ్యమైనది. ఇదే సమయంలో కస్టమర్లు హ్యాచ్‌బ్యాక్ నుంచి ఎస్‌యూవీలకు మారడం కూడా వాహనాల సగటు ధర పెరిగేందుకు దోహదపడిందని శ్రీవాస్తవ చెప్పారు. 2023 కేలండర్ ఏడాదిలో దేశీయంగా పీవీ అమ్మకాలు రికార్డు స్థాయిలో 41 లక్షల మార్కును దాటింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 26 శాతం అధికం. ఎస్‌యూవీలకున్న డిమాండ్ కారణంగానే రికార్డు అమ్మకాలు జరిగాయని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed