ఆటో డీలర్లు వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించాలన్న నితిన్ గడ్కరీ!

by Vinod kumar |
ఆటో డీలర్లు వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించాలన్న నితిన్ గడ్కరీ!
X

న్యూఢిల్లీ: దేశీయ ఆటో డీలర్లకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలిచ్చారు. ఆటో డీలర్లు వాహనాల స్క్రాపింగ్ కేంద్రాలను ప్రారంభించాలని, అందుకు అవసరమైన అనుమతులను ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. గురువారం జరిగిన ఐదవ ఆటో రిటైల్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ(రీ-యూజ్‌డ్ ఉత్పత్తుల వినియోగం)ని ప్రోత్సహిస్తుందని, అందుకు అనుగుణంగానే వాహన స్క్రాపింగ్ సౌకర్యం కోసం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనం, జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు, గ్రీన్ హైడ్రోజన్ తయారీలో కీలకంగా ఎదగడమే లక్ష్యంగా ఉన్నట్టు గడ్కరీ తెలిపారు.

భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా నిలిచిందని, ఈ క్రమంలో దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చేందుకు ఆటో డీలర్లు కీలక పాత్ర పోషిస్తారన్నారు. ప్రస్తుతం భారత్ ప్యాసింజర్ వాహనాల తయారీలో నాలుగో స్థానంలో ఉంది. కమర్షియల్ వాహన తయారీలో ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆటోమొబైల్ హబ్‌గా దేశాన్ని మార్చే లక్ష్యాన్ని కొనసాగించాలని గడ్కరీ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed