Vivo-Tata: వివో వాటా విక్రయానికి యాపిల్ అడ్డు..!

by Harish |
Vivo-Tata: వివో వాటా విక్రయానికి యాపిల్ అడ్డు..!
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో తన వాటాలను భారత టాటా గ్రూపుకు విక్రయించాలన్న ప్రతిపాదనలకు యాపిల్ కంపెనీ అడ్డు వస్తుంది. వివో కంపెనీ భారత్‌లో చాలా ఎళ్లుగా వ్యాపారం నిర్వహిస్తుంది. అయితే ఇటీవల కాలంలో చైనాతో పెరిగిన ఘర్షణల నేపథ్యంలో భారత్ చైనా కంపెనీలపై ఎక్కువ నిఘా పెట్టింది. దీంతో దేశీయ కంపెనీగా ముద్ర వేసుకోవడానికి వివో తన కంపెనీలో 51 శాతం వాటాను టాటా గ్రూపుకు విక్రయించాలని నిర్ణయించింది.

అయితే ఇప్పటికే టాటా, యాపిల్ కంపెనీలు కలిసి సంయుక్తంగా ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా-వివో డీల్‌పై యాపిల్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. దీంతో టాటా కంపెనీ ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. భారత్‌లో యాపిల్ కంపెనీకి వివో ప్రధాన పోటీదారుగా ఉంది. స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో ఐఫోన్లకు ధీటుగా వివో స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతున్నాయి. తమ పోటీదారు తమ భాగస్వామితో కలవడం యాపిల్‌కు ఇష్టం లేదు. దీంతో టాటా యాపిల్‌కు వ్యతిరేకంగా వెళ్లకుండా వివో ప్రతిపాదనను ప్రక్కకు పెట్టినట్టు తెలుస్తుంది.

చైనా నుంచి వచ్చే పెట్టుబడులకు భారత్ మద్దతు ఇవ్వదని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది. చైనా కంపెనీలపై నిరంతరం పరిశీలన ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడిని ఎదుర్కొడానికి వివో తన వాటాను టాటాకు విక్రయించాలని చూసింది. దీని ద్వారా మేకిన్‌ ఇండియాలో భాగస్వామ్యం అవ్వడమే కాకుండా ఫండింగ్‌, వీసాలు పొందడమూ సులువు అవుతుంది. కానీ యాపిల్ ఇప్పుడు ఈ ప్రతిపాదనకు అడ్డుగా నిలవడం గమనార్హం.

Advertisement

Next Story