Amul: త్వరలో యూరప్ మార్కెట్లోకి అమూల్ ఎంట్రీ

by S Gopi |
Amul: త్వరలో యూరప్ మార్కెట్లోకి అమూల్ ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారిగా అమూల్‌ పాలు భారత్‌ వెలుపల, అమెరికా మార్కెట్లో విక్రయించిన గుజరాత్‌ కోఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జీసీఎంఎంఎఫ్‌) దాన్ని మరింత విస్తరించనుంది. తాజాగా యూరప్ మార్కెట్లలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నామని జీసీఎంఎంఎఫ్‌ ఎండీ జయెన్‌ మెహతా చెప్పారు. యూఎస్ మార్కెట్లలో అమూల్ తాజా పాలు అత్యంత విజయవంతమైన బ్రాండ్‌గా కొనసాగుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. రానున్న రోజుల్లో ప్రపంచంలోనే మూడో వంతు పాలను ఉత్పత్తి చేయగల దేశంగా మారుతుందని జయెన్ మెహతా తెలిపారు. అమెరికా తర్వాత యూరప్‌లో వినియోగదారులకు అమూల్ ప్రొటీన్-రిచ్, ఆర్గానిక్, కెమికల్-ఫ్రీ ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా సంస్థ సామర్థ్యాన్ని, మౌలిక సదుపాయాలను విస్తరణను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, అమూల్ ప్రతిరోజూ 310 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. దేశవ్యాప్తంగా 107 డైరీ ప్లాంట్లు, 50కి పైగా ఉత్పత్తులతో ఏటా 2,200 కోట్ల ప్యాక్‌లను విక్రయిస్తున్నట్టు మెహతా వెల్లడించారు.

Advertisement

Next Story