భారత్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న అమెజాన్!

by Harish |   ( Updated:2023-06-05 12:38:21.0  )
భారత్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్న అమెజాన్!
X

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించి పదేళ్లు గడిచిన సందర్భంగా సెల్లర్ ఫీజులో 10 శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ ఫీజు తగ్గించడం వల్ల ఆ భారాన్ని విక్రేతలు వినియోగదారులకు కూడా బదిలీ చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2013, జూన్ 5న దేశీయంగా వ్యాపారం ప్రారంభించిన సంస్థ క్లౌడ్ సేవలు, ఈ-కామర్స్, వీడియో స్ట్రీమింగ్ సహా మరిన్ని విభాగాల్లోకి విస్తరించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమెజాన్ 12 లక్షల మంది విక్రేతలను కలిగి ఉంది. ఈ క్రమంలో దేశీయంగా పదేళ్ల ఉనికిని పూర్తి చేయడం గర్వంగా ఉందని, ముఖ్యంగా వినియోగదారులకు మెరుగైన ప్రయోజనాలు, స్థానిక భాషలలో సేవలందించడం వంటి అంశాలు కంపెనీ అగ్రగామిగా నిలిచేందుకు దోహదపడ్డాయని అమెజాన్ కార్యకలాపాల వైస్-ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ చెప్పారు.

ఇబ్బందుల్లేకుండా వినియోగదారులకు అధునాతన టెక్నాలజీ వినియోగించి అవసరమైన ఉత్పత్తులను అందించాం. భవిష్యత్తులో అన్ని రకాల వ్యాపారాలను డిజిటలైజ్ చేయడమే లక్ష్యమని కంపెనీ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించింది.

దేశంలోని అధిక జనాభా, పెరుగుతున్న ఆదాయం, ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం ద్వారా రానున్న రోజుల్లో వ్యాపారం వృద్ధి మరింత పెరగనుంది. వినియోగదారుల కోసం మరిన్ని సేవలందించేందుకు కట్టుబడి ఉన్నాం. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌ల ద్వారా భారత 1 ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీకి సహకారం అందించాలనే లక్ష్యంతో ఉన్నామని అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed