ఆకాశ ఎయిర్ ఆర్థికంగా బలంగా ఉంది: సీఈఓ వినయ్ దూబే!

by srinivas |
ఆకాశ ఎయిర్ ఆర్థికంగా బలంగా  ఉంది: సీఈఓ వినయ్ దూబే!
X

న్యూఢిల్లీ: ఇటీవలే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ పటిష్టమైన నిధులను కలిగి ఉందని, మరో 18 నెలల్లో రెండో పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్‌ను ఇచ్చేంత సమర్థవంతంగా ఉందని సంస్థ సీఈఓ వినయ్ దూబే అన్నారు. సంస్థ కీఅక పెట్టుబడిదారుడిగా ఉన్న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం కన్నుమూసిన నేపథ్యంలో వాటాదారులకు ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఉన్న వినయ్ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేశారు. సంస్థ వృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేవని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం సంస్థ తన మూడో విమానాన్ని డెలివరీ అందుకుంది. ఇది ముంబై-బెంగళూరు మధ్య ప్రయాణానికి వినియోగించనున్నారు. ప్రతి రెండు వారాలకు ఒక కొత్త విమానాన్ని అందుబాటులోకి తీసుకురావాలనేది సంస్థ లక్ష్యమని, ఆకాశ ఎయిర్ రానున్న ఐదేళ్లలో 72 విమానాలను విధుల్లో ఉంచనుందని ఆయన వివరించారు. ఆర్థికంగా సంస్థ బలంగానే ఉందని, రాబోయే 18 నెలల పాటు విమానాలను కొనేందుకు అవసరమైన పటిష్టంగా ఉందని ఆయన వెల్లడించారు. కాగా, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ ఎయిర్‌లో రూ. 260 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఆయన కుటుంబం మూడు ట్రస్తుల ద్వారా విమానయాన సంస్థలో వాటాలను కలిగి ఉంది. రాకేశ్ భార్య రేఖ కూడా ఇందులో వాటాదారుగా ఉన్నారు.

Advertisement

Next Story