India: FY24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతం: ADB

by Harish |
India: FY24లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతం: ADB
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7 శాతం వృద్ధిని సాధించగలదని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) అంచనా వేసింది. బుధవారం నాడు విడుదలైన నివేదిక ప్రకారం, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని భారత్ దాటుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొంది. ఇదే ఊపును కొనసాగిస్తూ, ఎఫ్‌వై24లో(31 మార్చి 2025 నాటికి) భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 7 శాతం, ఎఫ్‌వై25లో 7.2 శాతం వద్ద వృద్ధి చెందుతుందని ADB అంచనా వేస్తోంది. అలాగే, ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు FY24వృద్ధి అంచనాను ఏప్రిల్ 4.9 శాతం నుండి 5 శాతానికి పెంచగా, FY25లో 4.9 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. 'ఆసియన్ డెవలప్‌మెంట్ ఔట్‌లుక్ (ADO) సెప్టెంబర్ 2024'లో భాగంగా ఈ నివేదికను విడుదల చేశారు.

అభివృద్ధి చెందుతున్న ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 2024లో 2.8%కి తగ్గుతుందని, ఇది మునుపటి అంచనా 3.2%తో పోలిస్తే తగ్గుదల అని ఆసియా అభివృద్ధి బ్యాంకు పేర్కొంది. ప్రపంచ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ధృఢంగా ఉంది. పరిశ్రమలు, సేవల రంగాల్లో బలమైన పనితీరు, వ్యవసాయ మెరుగుదల కారణంగా గ్రామీణ వ్యయం పెరగడం, కొత్త పెట్టుబడులు భారీగా పెరగడం వంటి అంశాల కారణంగా భారత్ స్థిరమైన వృద్ధికి సిద్ధంగా ఉందని ఇండియా ADB కంట్రీ డైరెక్టర్ మియో ఓకా అన్నారు.

కార్మికులు, కంపెనీలకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాలను అందించే కొత్త ప్రభుత్వ విధానం కార్మిక డిమాండ్‌ను పెంచుతుందని, FY25 నుండి కొత్త ఉద్యోగాల సృష్టి పెరుగుతుందని ADB తెలిపింది. అధిక వ్యవసాయ ఉత్పత్తి అంచనాలు ఉన్నప్పటికీ, పెరిగిన ఆహార ధరల కారణంగా FY24లో భారతదేశ వినియోగదారు ద్రవ్యోల్బణం 4.7%కి పెరుగుతుందని అంచనా వేసింది.

వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాలో మెరుగుదల, ఆహార ధరల్లో తగ్గుదల ఉన్నట్లయితే భారత రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనా వేసింది. మెరుగైన ఎగుమతులు, తక్కువ దిగుమతులు, బలమైన రెమిటెన్స్ ఇన్‌ఫ్లోల కారణంగా భారతదేశ కరెంట్ ఖాతా లోటు FY24లో GDPలో 1 శాతం, FY25లో 1.2 శాతంగా ఉంటుందని ADB పేర్కొంది.

Next Story