భారీగా ఉద్యోగులను తొలగించనున్న గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్!

by Harish |   ( Updated:2023-03-23 13:17:04.0  )
భారీగా ఉద్యోగులను తొలగించనున్న గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్!
X

న్యూఢిల్లీ: గ్లోబల్ ఐటీ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది. ఏకంగా 19,000 మందిని తొలగించనున్నట్లు గురువారం వెల్లడించింది. ఇది కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతానికి సమానం కావడం గమనార్హం. మొత్తం తొలగింపుల్లో సగానికి పైగా క్లయింట్లతో నేరుగా సంబంధం లేని ఉద్యోగులపైనే ప్రభావం ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవోల్బణ పరిస్థితుల మధ్య ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది.

అంతేకాకుండా యాక్సెంచర్ తన వార్షిక రాబడి, లాభాల అంచనాలను కూడా తగ్గించింది. గతంలో అంచనా వేసిన 8-11 శాతం ఆదాయ వృద్ధిని 8-10 శాతానికి తగ్గిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో 16.1-16.7 బిలియన్ డాలర్ల పరిధిలో ఉంటుందని అభిప్రాయపడింది. ఐటీ రంగానికి సంబంధించి యాక్సెంచర్ కంపెనీ గణాంకాలు ఎంతో కీలకం. గ్లోబల్ ఐటీ పరిశ్రమలో త్రైమాసిక ఫలితాలను ముందుగా యాక్సెంచర్ కంపెనీయే ప్రకటిస్తుంది.

ఈ కంపెనీ ఆదాయ వివరాల ఆధారంగానే భారత్‌లో ఐటీ కంపెనీల ఆదాయాలను మార్కెట్ వర్గాలు అంచనా వేస్తాయి. కాబట్టి భారత ఐటీ రంగానికి యాక్సెంచర్ డేటా కీలకంగా చూడాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటివరకు గ్లోబల్ దిగ్గజ టెక్ కంపెనీలు చేపట్టిన భారీ లేఆఫ్స్‌లో యాక్సెంచర్ మూడో స్థానంలో నిలిచింది. అత్యధికంగా అమెజాన్ 27 వేలు, మెటా 21 వేల మందిని రెండు దశల్లో తొలగించాయి.

Also Read...

సూపర్ యాప్ కోసం అదనపు నిధులు కేటాయించే పనిలో టాటా గ్రూప్!

Advertisement

Next Story