Economic survey: పటిష్టంగా ఆర్థికవ్యవస్థ.. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

by S Gopi |
Economic survey: పటిష్టంగా ఆర్థికవ్యవస్థ.. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రకటనకు ముందు ఆర్థిక సర్వేను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటూనే భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా, స్థిరంగా ఉందని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 476 పేజీల ఆర్థిక సర్వేలో దేశ ఆర్థిక వ్యవస్థ కోవిడ్ అనంతర రికవరీని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఆర్థిక స్థిరత్వం సాధించడంలో విధాన నిర్ణేతలు కీలక పాత్ర పోషించారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో అస్థిరత ఉన్నప్పటికీ భారత వృద్ధి విస్తరణ కొనసాగుతోంది. జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక లోటు వంటి కీలక అంశాలను ఆర్థిక సర్వేలో ప్రస్తావించారు. రికవరీ నిలకడగా కొనసాగేందుకు దేశీయంగా అనేక అంశాలను బలోపేతం చేయాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడులు, క్లైమెట్‌కు సంబంధించి పరిణామాల మధ్య ఒప్పందాలు పూర్తవడం క్లిష్టంగా మారాయని సర్వే అభిప్రాయపడింది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక పనితీరు గురించి వివరిస్తూనే, వచ్చే ఆర్థిక సంవత్సరానికి అనుసరించాల్సిన వ్యూహాలను అంచనా వేసేందుకు ఉద్దేశించినదే ఈ 'ఆర్థిక సర్వే'. కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. దీన్ని ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందిస్తుంది. గతంలో అంటే 1950-51 ఆర్థిక సంవత్సరం వరకు బడ్జెట్‌తో పాటే ఆర్థిక సర్వేను కూడా ప్రవేశపెట్టే ఆనవాయితీ ఉండేది. 1960 తర్వాత నుంచి బడ్జెట్ వెలువడేందుకు ఒకరోజు ముందు దీన్ని అందిస్తున్నారు.

దేశ జీడీపీ..

ఆర్థిక సర్వే ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి 6 నుంచి 6.8 శాత మధ్య ఉండనుందని అంచనా. ఇది కేంద్ర గణాంకాల అమలు మంత్రిత్వ శాఖ అంచనా 8.2 శాతం కంటే తక్కువగా ఉంది. అలాగే, వచ్చే 2024-25 ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం నుంచి 7 శాతంగా అంచనా వేసింది. కరోనా మహమ్మారి పరిస్థితుల నుచి ఆర్థికవ్యవస్థ మెరుగుపడిందన్న ఆర్థిక సర్వే.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక రంగం, క్లైమెంట్ ఆధారంగా 2024-25లో వృద్ధి కొనసాగనుందని తెలిపింది. దేశీయంగా ప్రైవేట్ వ్యయం బలంగా ఉందని పేర్కొంది. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయంగా పరిణామాలు భారత వృద్ధికి మద్దతిస్తున్నాయి.

ద్రవ్యోల్బణం..

గతేడాది ప్రారంభం నుంచి భౌగోళిక పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, రుతుపవనాల ప్రభావం వల్ల భారత్ ద్రవ్యోల్బణం ఒత్తిడిని ఎదుర్కొంది. అయినప్పటికీ ప్రభుత్వం ద్రవ్య విధానం, సరైన చర్యల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొంది. తద్వారా 2023-24లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 6.7 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గించింది.

ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు కావాలి..

ప్రపంచ ఆర్థికవ్యవస్థ కష్టాల్లో ఉన్న కారణంగా మూలధన నిధుల రాకపై ఇది ప్రభావం ఉంటుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. పెరుగుతున్న శ్రామిక శక్తిని అనుగుణంగా దేశం 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏడాదికి సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో సేవా రంగం మరింత వృద్ధి చెందనుంది. ఉద్యోగాలను కల్పించడంలో కార్పొరేట్ రంగం మరింత విస్తృతంగా పనిచేయాలని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ప్రభుత్వం పీఎల్ఐ, మిత్రా టెక్స్‌టైల్ స్కీమ్, ముద్రా వంటి పథకాల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయగలదని పేర్కొంది.

మరోవైపు, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారు ఉన్నారని ఆర్థిక సర్వే తెలిపింది. కానీ, వారిలో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో కావాల్సిన నైపుణ్యాలు కొరవడుతున్నాయని పేర్కొంది. గ్రాడ్యుయేట్ చేసిన యువతలో 51 శాతం మంది మాత్రమే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం కలిగి ఉన్నారు. దానివల్ల ప్రతి ఇద్దరిలో ఒకరు నైపుణ్యం కొరత వల్ల ఉద్యోగాలకు సిద్ధంగా లేరని స్పష్టం చేసింది. క్రమంగ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ఉద్యోగాల్లో యువత, మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగినట్టు తెలిపింది.

భవిష్యత్తు వ్యూహాలు..

ఆర్థిక సర్వేలో ప్రభుత్వం భవిష్యత్తులో దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధిని కొనసాగించేందుకు కీలక వ్యూహాలను పేర్కొంది. అందులో ప్రధానంగా ప్రైవేట్ పెట్టుబడులను పెంచే చర్యలు, ఎంఎస్ఎంఈ రంగాన్ని విస్తరించడం, విధానపరమైన అడ్డంగులను తొలగించి వ్యవసాయ రంగాన్ని వృద్ధికి కీలకంగా మార్చడం, గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయింపులు, దేశంలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని తొలగించడం, ప్రభుత్వ రంగ సంస్థల సామర్థ్యాన్ని పెంచేందుకు నిర్ణయాలు ఉంటాయని ఆర్థిక సర్వే వెల్లడించింది.

బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ పనితీరు..

దేశ బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు మెరుగైన పనితీరును కొనసాగిస్తున్నాయి. బ్యాంకుల క్రెడిట్ వృద్ధి రెండంకెల స్థాయిలో ఉంది. స్థూల, నికర నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) కొన్నేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి.

ఆర్థిక సర్వేలో ఇతర ముఖ్యాంశాలు..

* ఫిన్‌టెక్‌ రంగంలో రెగ్యులేటరీ అంతరాలను గుర్తించడం. నిబంధనలను మెరుగుపరచడం నిరంతరం అవసరమని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.

* దేశీయంగా భవిష్యత్తు శ్రామికశక్తికి ఏఐ, ఆగ్రో-ప్రాసెసింగ్, పెరుగుతున్న గిగ్ ఎకానమీలో అధిక ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. వాతావరణ మార్పుల ప్రభావం పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది.

* ఏఐ వల్ల అన్ని నైపుణ్య స్థాయిల్లో ఉద్యోగులపై ప్రభావం అధికంగానే ఉండవచ్చు. ఇది రానున్న సంవత్సరాల్లో దేశ అధిక వృద్ధి రేటుకు అడ్డంకి కానుంది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగాలు సంయుక్తంగా పనిచేయాల్సి ఉంటుంది.

* దేశంలో 'అసమానతలాను పరిష్కరించడంలో పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisement

Next Story