Real Estate: 70 శాతం మహిళల పెట్టుబడులు రియల్ ఎస్టేట్‌లోనే

by S Gopi |
Real Estate: 70 శాతం మహిళల పెట్టుబడులు రియల్ ఎస్టేట్‌లోనే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మహిళలు ఆర్థిక విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల అంశాల్లోనూ తెలివైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఓ నివేదిక తెలిపింది. 2024 ఏడాదికి సంబంధించి ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ నిర్వహించిన ఓ సర్వేలో.. 70 శాతం మంది మహిళలు అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి సాధనంగా రియల్ ఎస్టేట్‌ను ఎంచుకున్నారు. కొవిడ్-19కి ముందు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు 57 శాతం మంది, 2022లో 65 శాతం మంది ఆసక్తి చూపించగా, ఇప్పుడు ఏకంగా 70 శాతానికి పెరగడం విశేషం. అయితే, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపించే మహిళలు 2022లో 20 శాతం నుంచి గతేడాది 2 శాతానికి పడిపోవడం గమనార్హం. 2022 నాటి ర్యాలీకి భిన్నంగా గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూస్తున్నాయి. దీన్ని బట్టి మహిళలు స్టాక్ మార్కెట్లను కాకుండా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా తెలివైన నిర్ణయం తీసుకున్నారని అనరాక్ ఛైర్మన్ అనూజ్ పూరి అన్నారు.

రియల్ ఎస్టేట్ తర్వాత బంగారంలో పెట్టుబడులకు 12 శాతం మంది మహిళలు ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇది 2022 నాటి 8 శాతం కంటే కొంత పెరిగింది. రియల్ ఎస్టేట్ విభాగంలోనూ బడ్జెట్ పరంగా మహిళలు ఖరీదైన, లగ్జరీ ఇళ్లకే ఎక్కువ మొగ్గు చూపారు. కనీసం 52 శాతం మంది మహిళలు రూ. 90 లక్షలు, అంతకంటే ఎక్కువ ఖరీదైన ప్రీమియం ఇళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. 33 శాతం మంది రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ఇళ్లను, 11 శాతం మంది రూ. 1.5-2.5 కోట్ల విలువైన ఇళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. రూ. 2.5 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన ఇళ్ల కోసం 8 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ధోరణి దేశంలోని మహిళల్లో ఆస్తి కొనుగోలు పట్ల, పెట్టుబడులపై మారుతున్న ఆసక్తిని సూచిస్తుంది. మహిళల్లో పెరుగుతున్న స్వతంత్ర నిర్ణయాలు, మెరుగైన ఆదాయం, గృహ నిర్మాణ మార్కెట్‌పై పెరుగుతున్న అవగాహనను ప్రతిబింబిస్తుందని అనూజ్ పూరి పేర్కొన్నారు.

Next Story