Most Powerful Women: ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ముగ్గురికి చోటు

by Shamantha N |
Most Powerful Women: ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ముగ్గురికి చోటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాదికి గానూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా (Forbes Most Powerful Women)ను ఫోర్బ్స్‌ ప్రకటించింది. భారత్ నుంచి ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, హెచ్ సీఎల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజూందర్ షా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. కాగా.. ఈసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాందించుకున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మరో అరుదైన ఘనత సాధించారు. వరుసగా ఆరోసారి నిర్మలకు ఈ జాబితాలో చోటు దొరికింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) 28వ స్థానంలో నిలిచారు. భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం, ప్రపంచవ్యాప్తంగా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు నిర్మలా కృషి చేశారు. భారత్‌లో తొలి, పూర్తిస్థాయి ఆర్థికమంత్రి అయిన నిర్మలా సీతారామన్‌, రాజకీయాల్లోకి రాకముందు బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు. గతేడాది ఆమె 32వ స్థానంలో ఉన్న ఆమె.. ఈ ఏడాది ర్యాంకింగ్ లో ఎగబాకారు.

మరో ఇద్దరు..

ఇక, భారత్‌ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా (Roshni Nadar Malhotra) ఈ జాబితాలో 81వ స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఈమె 60వ స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ కుమార్తె రోష్నీ నాడార్‌ మల్హోత్రా. జులై 2020లో హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వ్యూహాత్మక నిర్ణయాలతో కంపెనీని అగ్ర పథంలో నడిపిస్తున్నారని ఫోర్బ్స్‌ తెలిపింది. బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా (Kiran Mazumdar Shaw) తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచారు. గతేడాది కూడా ఆమె శక్తిమంతమైన మహిళగా 91వ స్థానంలో నిలిచారు.1978లో కిరణ్‌ మజూందర్‌ షా బయోకాన్‌ను నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో ఆమె భారత్‌లో అత్యంత సంపన్న మహిళల్లో ఒకరుగా ఎదిగారు. బయోకాన్‌కు మలేషియాలోని జొహొర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఇన్సులిన్‌ పరిశ్రమ ఉంది.

Advertisement

Next Story