Infosys jobs: IT జాబ్‌ కోసం చూస్తున్న వారికి గుడ్‌న్యుస్.. 20 వేల ఉద్యోగాలు

by Harish |   ( Updated:2024-07-19 09:10:00.0  )
Infosys jobs: IT జాబ్‌ కోసం చూస్తున్న వారికి గుడ్‌న్యుస్.. 20 వేల ఉద్యోగాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(ఎఫ్‌వై25) కొత్తగా 15,000-20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని చూస్తోంది. తాజాగా విలేకరుల సమావేశంలో ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) జయేష్ సంఘ్‌రాజ్కా ఈ ప్రకటన చేశారు. గత కొంత కాలంగా ఉద్యోగుల నియామకాలను చాలా వరకు తగ్గించిన కంపెనీ ఈ ఏడాది మాత్రం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్‌ల ద్వారా ఫ్రెషర్‌లను నియమించుకుంటామని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులు రాకపోవడం, అలాగే అన్ని విభాగాల్లో ఆర్టిఫిషియల్ ప్రభావం పెరగడం, కంపెనీలు తమ వ్యయ నియంత్రణలో భాగంగా కొత్త రిక్రూట్‌మెంట్‌లను చేపట్టడం లేదు. ఇలాంటి తరుణంలో దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్‌ భారీ స్థాయిలో ఉద్యోగాలు అందించడానికి ముందుకు రావడంతో ఐటీ ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ మాట్లాడుతూ, గత కొన్ని త్రైమాసికాల్లో ఉద్యోగుల క్షీణత ఎక్కువగా ఉన్నప్పటికీ అది ఈ త్రైమాసికంలో చాలా వరకు తగ్గిందని అన్నారు. దాదాపు 2000 మంది ఉద్యోగులు తగ్గినట్టు పేర్కొన్నారు. వృద్ధిని చూడటం మొదలైనప్పుడు రాబోయే రోజుల్లో మరిన్ని నియామకాలను చేపడుతామని జయేష్ సంఘ్‌రాజ్కా చెప్పారు.

ఇదిలా ఉంటే మరో దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎఫ్‌వై25లో సుమారు 40,000 మంది కొత్త గ్రాడ్యుయేట్‌లను నియమించుకోవాలని యోచిస్తోంది, ఇది ఇప్పటికే Q1లో 11,000 మంది ట్రైనీలను ఆన్‌బోర్డ్ చేసింది. ఇదే త్రైమాసికంలో HCLTech కూడా 8,080 మంది ఉద్యోగుల తగ్గింపును చూసింది.

Advertisement

Next Story