- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్ డౌన్ తో భవన నిర్మాణ కార్మికుల లైఫ్ బ్రేక్ డౌన్..
దిశ, న్యూస్‌బ్యూరో: ”తెలంగాణ గడ్డమీద ఉన్న ప్రతీ ఒక్కరూ మా బిడ్డలే. వారి కడుపు నింపుతాం. పస్తులుండనివ్వం. రేషనుకార్డు ఉన్నా లేకున్నా తలా రూ. 500 నగదుతో పాటు ఆరు కిలోల బియ్యం ఇస్తాం. ఆందోళన అవసరం లేదు”.. ముఖ్యమంత్రి కేసీఆర్
”భవన నిర్మాణ సంస్థలే వారి కార్మికుల బాగోగులు పట్టించుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం తగదు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వారికి వేతనాలు ఇవ్వడంతో పాటు రోజువారీ అవసరాలను తీర్చాలి”.. మంత్రి కేటీఆర్
ఈ మాటలు నిజంగానే భవన నిర్మాణ కార్మికుల్లో ఆశలు కల్పించాయి. ఉపాధి లేకపోయినా కడుపు నిండుతుందనే నమ్మకాన్ని రేకెత్తించింది. కానీ అవి అడియాశలే అయ్యాయి. రెక్కాడితేగానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు ఒక పూట తిని మరో పూట పస్తులుంటున్నారు. వీరి ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించడంలేదు. జనతా కర్ప్యూ తర్వాత వారం రోజుల దాకా కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా వారి బాధలు వెళ్ళబోసుకున్నారు. అంటే వారం రోజులైనా వారికి ప్రభుత్వం తరఫున సాయం అందలేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకావడంలేదనేదానికి ఇది నిదర్శనం. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో పుష్కలంగా డబ్బు ఉన్నా దాన్ని ప్రభుత్వం ఏ మేరకు ఖర్చు పెడుతుందో అనుమానమే. అందుకు కార్మికుల దీన స్థితే నిదర్శనం. దయతలచి ఎవరో వచ్చి ఆహారపు పొట్లాలు ఇస్తేనే వీరి కడుపు నిండుతోంది. రాష్ట్రాల హద్దులు దాటి వచ్చి భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం బోర్డు దగ్గర జమ అయిన డబ్బును వాడుకోవచ్చంటూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసినా వీరి కడుపు మాత్రం నిండడం లేదు. చేతిలో డబ్బు ఉన్నా పస్తులు తప్పడంలేదు.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం గతేడాది నవంబరు చివరి నాటికి దేశం మొత్తంమీద సుమారు 3.92 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే అందులో తెలంగాణలో సుమారు 14.29 లక్షల మంది ఉన్నారు. వీరంతా బోర్డులో సభ్యత్వం కలిగినవారే. కానీ లెక్కలోకి రానివారు, సభ్యత్వంలేని కార్మికులు రాష్ట్రంలో మరో నాలుగైదు లక్షల మందే ఉంటారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా పలు సందర్భాల్లో నగర శివారు ప్రాంతాల్లో సుమారు ఐదారు లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మరొక అడుగు ముందుకేసి వీరిని బ్యాచ్‌లవారీగా విభజించి లాక్‌డౌన్ సమయంలో ఉపవాసం ఉండకుండా అందరికీ కడుపు నింపే కార్యక్రమం తీసుకుంటున్నామన్నారు. కానీ అది మాటలకే పరిమితమైంది. నగర శివారు ప్రాంతమైన వసస్థలిపురం ఆటోనగర్ సమీపంలో వేలాది మంది కార్మికులు ఇప్పటికీ అర్థాకలితో అలమటిస్తున్నారు. భవన నిర్మాణంలో ప్రత్యక్షంగా సంబంధం లేకుండా గ్రానైట్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, పెయింటింగ్, ప్లంబర్ పనులు… ఇలా అనేక పనులు చేసేవారు బోర్డుతో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి నగరంలో పనిచేస్తున్నారు. వీరి పరిస్థితి కూడా చాలాచోట్ల దయనీయంగానే ఉంది. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి పోతే సరి… లేకుంటే గాలిలో దీపమే వీరి జీవితం. ముఖ్యమంత్రి ఆశించింది ఒకటైతే అధికారుల నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయిలో జరుగుతోంది మరొకటి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం గతేడాది మార్చి చివరి నాటికే తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో సుమారు రూ. 1210 కోట్ల మేర ‘సెస్’ జమ అయ్యింది. ఇందులో కార్మికుల సంక్షేమం కోసం సుమారు రూ. 262.92 కోట్లను ఖర్చు చేసింది. మిగిలినదంతా బోర్డు దగ్గరే ఉంది. ఈ డబ్బును ప్రస్తుత కరోనా లాక్‌డౌన్ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన భవన నిర్మాణ కార్మికుల అవసరాలకోసం వాడుకోవచ్చంటూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ సర్క్యులర్ జారీ చేసింది. అయినా కార్మికుల కడుపు నిండడంలేదు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధి క్రమబద్ధీకర్ చట్టం (1996) ప్రకారం ప్రతీ భవన నిర్మాణ వ్యయంలో 1% మేర సెస్ రూపంలో బోర్డు నిధికి జమ చేయాల్సి ఉంటుంది. గతేడాది మార్చి చివరి నాటికి దేశం మొత్తం మీద సుమారు రూ. 49,688 కోట్ల మేర జమ అయింది. ప్రమాదాలు, ఆరోగ్యం, బీమా తదితర అవసరాలకు రూ. 19,379 కోట్ల మేర ఖర్చయింది. మిగిలినదంతా ఆయా రాష్ట్రాల బోర్డుల దగ్గరే ఉండిపోయింది. ఈ కష్టకాలంలో వాటిని వాడి కార్మికుల కడుపు నింపొచ్చు. కానీ అది అమలుకావడంలేదు. మంత్రి కేటీఆర్ ఆదేశం ప్రకారం ఈ కార్మికుల సంక్షేమం, వేతనం తదితరాల గురించి భవన నిర్మాణ సంస్థల యాజమాన్యమే పట్టించుకోవాలని స్పష్టం చేశారు. అది కూడా అమలుకావడంలేదు.
లాక్‌డౌన్ కారణంగా మెజారిటీ భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కార్మికులకు ఉపాధి లేకుండాపోయింది. కొద్దిమంది స్వంత ఇండ్లకు చేరుకోగా మరికొద్దిమంది సైట్ క్యాంపుల్లోనే తలదాచుకుంటున్నారు. ఏ రోజుకారోజు అన్నట్టుగా వీరి జీవితం అగమ్యగోచరంగా తయారైంది. రెండు రోజులు ఇంటి దగ్గర ఉంటే మూడో రోజు ఇంట్లో పొయ్యి వెలుగని దీనమైన స్థితి కనిపిస్తోంది. గడచిన ఇరవై రోజులుగా పనులు లేక చేతిలో చిల్లిగవ్వలేక పూట గడవడం గగనంగా మారింది. మురికివాడల్లో అద్దె ఇండ్లలో ఉండే కార్మికులకు అద్దె చెల్లించే మార్గం లేకుండాపోయింది. ఇంటి యజమానులు ఖాళీచేయిస్తే ఎక్కెడికెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రతీ ఏటా సభ్యత్వం కోసం కట్టిన డబ్బులోంచి, సెస్ రూపంలో పోగైన నిధి నుంచి సాయం అందుతుందేమోనని ఎదురుచూసినా అది అందని ద్రాక్షే అయింది. సంక్షేమ బోర్డు ఏమైందోననే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది.
అప్పు కూడా పుట్టడం లేదు: వెంకటస్వామి, రాజేందర్‌నగర్ భవన నిర్మాణ కూలీ
”పాతికేళ్ళుగా మేస్త్రీ పని చేస్తున్నాను. ఏనాడూ ఇంత ఘోరమైన పరిస్థితిని చూడలేదు. పని లేక ఇంటి దగ్గర ఉండడం ఇదే మొదటిసారి. రోజూ పనికి వెళ్తేనే కుటుంబం నడవడం కనాకష్టం. నెల రోజుల్లో 20 రోజులైనా పని దొరికితే అదే భాగ్యం. నెల మొత్తం పనిచేస్తే పన్నెండు వేలు వస్తాయి. దీంతోనే కుటుంబం నడవాలి. ముగ్గురు పిల్లలనూ చదివించుకోవాలి. ఎదైనా రోగం వస్తే మళ్ళీ అప్పులే. మా బతుకు బండి కత్తిమీద సామే. మాయదారి వైరస్ వచ్చి మా బతుకును బజారుపాలు చేసింది. చేద్దామంటే పని లేదు. తిందామంటే తిండిలేదు. అప్పు ఇచ్చేవారూ లేరు. నిన్నటిదాకా పలకరించిన ఆసాములు ఇప్పుడు ముఖం మీదనే చెప్పేస్తున్నారు. ఎట్ల బతకాలో ఆర్థమైతలేదు. కేరళలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి రూ. 5000 సాయం అందుతోంది. ఇక్కడేమో కనీసం పూటకు తిండి కూడా దొరుకుతలేదు” అని వెంకటస్వామి అనే భవన నిర్మాణ కూలీ కార్మికుడు మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వమే కార్మికుల్ని ఆదుకోవాలి : కోటరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు
”కార్మికుల కష్టార్జీతం బిల్డింగ్ వర్కర్స్ వెల్పేర్ బోర్డులో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి కార్మికుల సంక్షేమం కోసమే ఉద్దేశించబడినవి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఆ నిధులను కార్మికులను ఆదుకోవడానికి ఉపయోగించాలి. గతంలో పనులు నిల్చిపోయిన సందర్భాల్లో సంక్షేమ బోర్డు నుంచి కార్మికులకు ఆర్థిక సహాయాలు అందించారు. ఇప్పుడు మూడు వారాల నుంచి కార్మికులకు పనులు లేక నానా అవస్థలు పడుతున్నారు. కానీ ప్రభుత్వానివి కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి. కేరళ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి. ప్రతీ కార్మికునికి ఆర్థిక సహాయం కింద లాక్‌డౌన్ సమయంలో రూ.10,000 చొప్పున ఇవ్వాలి” అని కార్మిక సంఘం నాయకుడు కోటరాజు వ్యాఖ్యానించారు.
Tags: building workers, coronavirus, lockdown,kerala, Welfare Board