ముగిసిన బడ్జెట్ సమావేశాలు.. ఉభయ సభలు నిరవధిక వాయిదా

by Shamantha N |
Parliament
X

న్యూఢిల్లీ: పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు గురువారం ముగిశాయి. గడువుకు ముందే ఉభయ సభలను కేంద్రం నిరవధిక వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో జనవరి 29న ప్రారంభమైన బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13కు ముగిశాయి. రెండో విడత సమావేశాలు మార్చి 8న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 8వ తేదీన ముగియాల్సి ఉండగా 14 రోజులు ముందుగానే లోక్‌సభ, రాజ్యసభలను కేంద్రం నిరవధిక వాయిదా వేసింది.

అసెంబ్లీ ఎన్నికల కారణంగా సభలను వాయిదా వేయాల్సిందిగా పార్టీలకు అతీతంగా ఎంపీలు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడును కోరారు. టీఎంసీ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఓబ్రియన్‌లు సభలను వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థిస్తూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు లేఖ రాశారు. రెండో విడత పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలను పెద్దమొత్తంలో కట్టబెట్టే జీఎన్‌సీటీడీ సవరణ బిల్లు గందరగోళాన్ని రేపింది. విపక్ష ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు, నినాదాలు చేయడమే కాకుండా వాకౌట్‌లూ చేశారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 29 వరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed