వేలాది మూగజీవాల కడుపు నింపుతున్న బౌద్ధ సన్యాసి

by Shyam |   ( Updated:2021-06-30 05:03:23.0  )
Buddhist monk has rescued thousands of animals
X

దిశ, ఫీచర్స్ : పెంపుడు జంతువులను ఇంట్లో మనుషుల్లా చూస్తుంటాం. భిక్షగాళ్లకు కడుపు నిండా అన్నం పెడుతుంటాం. ఎవరైనా ఆపదంటూ ఆశ్రయిస్తే ఉన్నదాంట్లోనే ఏదో ఒక సాయం చేస్తాం. మరి వీధుల్లోని జంతువుల పరిస్థితేంటి? వీలైతే ఓ బిస్కెట్‌ వేస్తాం.. లేదంటే జాలి పడి అక్కడి నుంచి వెళ్లిపోతాం.. అంతే కదా! గాలికి తిరుగుతూ, రాళ్ల దెబ్బలు తింటూ, చివరకు ఏ వాహనం కిందో పడి రాలిపోయే వీధి శునకాల సమస్యలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంటూ దాదాపు 30 ఏళ్ల నుంచి వాటికి ఆశ్రయం కల్పిస్తున్నాడు ఓ బౌద్ధ గురువు. చైనాలోని షాంఘైలో నివసించే జిక్సియాంగ్ వీధి కుక్కలను చూసుకోవటానికి తన జీవితాన్నే అంకితం చేశాడు.

53 ఏళ్ల జిక్సియాంగ్.. షాంఘైలోని బావోన్ ఆలయానికి ప్రధాన మాంక్. వీధుల్లోని మూగజీవాల దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన అతడు 1994 నుంచి వాటిని చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నాడు. తొలిగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పిల్లిని కాపాడిన తనకు అదే అలవాటుగా మారిపోగా.. ప్రస్తుతం జిక్సియాంగ్ సంరక్షణలో వందలాది పిల్లులు, కోళ్లు, బాతులు, నెమళ్లతో పాటు 8,000 కుక్కలున్నాయి. ఇక తన పూర్తి సమయాన్ని ఆ జీవుల సంరక్షణకే వెచ్చిస్తున్న చైనీస్ మాంక్.. వాటికి చిన్న జబ్బుచేసినా కంగారు పడిపోయేంత ప్రేమను పెంచుకోవడం విశేషం. అంతేకాదు వెటర్నరీ వైద్యుడికి ఇచ్చే డబ్బుతో మూగజీవులకు మరింత పౌష్టికాహారం అందించవచ్చనే భావనతో ఔషధాలు, ఇంజెక్షన్ వేయడం కూడా నేర్చుకున్నాడు. మరోవైపు వీధుల్లో తిరిగే జీవుల కోసం తన అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.

జిక్సియాంగ్ సంరక్షణలో ఉన్న చాలా వరకు కుక్కలు ఫెంగ్సియాంగ్‌లోని బహిరంగ ఆశ్రయం నుండి వచ్చినవే. ఇందులోని కుక్కలకు సరిగా ఆహారం కూడా పెట్టకపోవడం వల్ల ఆకలితో చనిపోతుంటాయి. వీటన్నింటినీ చేరదీసే ఈ బౌద్ధ సన్యాసి.. తను పెంచుతున్న చాలా శునకాలను యూఎస్ లేదా యూరోపియన్ దేశాల్లో పునరావాసానికి పంపిస్తుంటాడు. కాగా ఇంటికి కాపలా కోసమని అనేక మంది శునకాలను దత్తత తీసుకునేందుకు తన దగ్గరకు వస్తుంటారు. కానీ అలాంటివాళ్లకు ఇవ్వనని ఖరాఖండిగా చెబుతాడు జిక్సియాంగ్. 2017 వరకు తన సొంత డబ్బులతోనే వీటి బాగోగులు చూసుకున్నా.. ఆ తర్వాతి నుంచి వాటి సంరక్షణ, పోషణ కోసం విరాళాలు సేకరిస్తున్నాడు.

సన్యాసులు రోజంతా ఆలయంలో కూర్చోవాలని జనాలు అనుకుంటారు. కానీ ప్రాణాలు కాపాడమని, అన్ని జీవితాలు సమానమే అని బుద్ధ భగవాన్ చెబుతాడు. జిక్సియాంగ్ కూడా అదే నమ్మాడు. తను చనిపోయేవరకు ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తానని అంటున్నాడు. ఇక చైనాలో తీవ్రమైన స్ట్రే డాగ్ సమస్య ఉంది. 2019 లెక్కల ప్రకారం చైనాలో సుమారు 50 మిలియన్ల వీధి శునకాలుండగా, ప్రతీ సంవత్సరం ఆ సంఖ్య రెట్టింపు అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed