షాకింగ్.. వ్యక్తిని హత్య చేసి, చేయి నరికి సంచిలో వేసుకుని..

by srinivas |   ( Updated:2021-04-07 03:10:39.0  )
షాకింగ్.. వ్యక్తిని హత్య చేసి, చేయి నరికి సంచిలో వేసుకుని..
X

దిశ, వెబ్ డెస్క్ : అక్రమ సంబంధం మోజులో పడి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన సట్టి గాలెయ్య అనే వ్యక్తి ఈజీ మనికి అలవాటు పడి నేను నక్సలైట్‌ను అంటూ అందరిని బెదిరించి డబ్బులు గుంజేవాడు. అయితే ఇదే క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెకు లగ్జరీ లైఫ్ చూపించాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరికి పోలీసులకు దొరకడంతో సీన్ రివర్స్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే… గాలెయ్య అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ గుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లి తాను నక్సలైటును అంటూ చెప్పుకుని డబ్బులు వసూలు చేసేవాడు. కొద్దిరోజుల నుండి అతడికి భూలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కోసం భారీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. గతంలోలాగా కాకుండా ఈసారి ఏకంగా ఓ మనిషినే హత్య చేయాలని డిసైడయ్యాడు. ఎవరినైనా చంపి, చేయిని నరికి ధనవంతుడి ఇంటిలో పడేయాలన్నది అతడి ప్లాన్. అలా పడేసిన తర్వాత పోలీసుల రూపంలో వెళ్లి బెదిరించి భయపెట్టి కోట్లకు కోట్లు కొట్టేయాలని పథకం రెడీ చేసుకున్నాడు.

ముందుగా అనుకున్నట్టుగానే గుంటూరు జిల్లా నరసరావు పేట బస్టాండ్ వద్ద మద్యం షాపులో మిండ్యాల చినమారయ్య అలియాస్ చినమారాజు (24) అనే కుర్రాడితో గాలెయ్య పరిచయం చేసుకొని, అతడితో కొద్ది సేపు మాట్లాడి.. స్నేహితులందరం కలిసి పార్టీ చేసుకుంటున్నామనీ, అక్కడయితే మందుతో పాటు విందు కూడా ఉంటుందని నమ్మబలికి, మార్చి 30వ తేదీన అతడిని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు సమీపంలోని రామచంద్రపాలెం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లోకి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. స్నేహితులు దారిలో ఉన్నారంటూ అతడిని మాటల్లో పెట్టి, మారయ్యను పూర్తిగా మద్యం మత్తులోకి దించి అదును చూసుకొని అక్కడే ఉన్న రాయితో తలపై మోది హత్య చేసాడు.

తరువాత తనతోపాటు తెచ్చుకున్న కత్తితో మారయ్య ఎడమ చేయిని నరికి సంచీలో పెట్టుకొని, తాను వేసిన పథకాన్ని అమలు చేసేందుకు బయలు దేరాడు. నరికిన చేయి ఉన్న సంచీని తీసుకుని మానస సరోవరం వద్ద ఓ లారీని ఎక్కాడు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు లారీలను తనిఖీలు చేస్తున్నారు. అతడు ఎక్కిన లారీని కూడా చెకింగ్ వద్ద పోలీసులు ఆపారు. గాలెయ్య ప్రవర్తన చూసి అనుమానం వచ్చిన పోలీసులు అతడిని తనిఖీ చేయగా, అతడి వద్ద ఉన్న సంచీలో ఏముందో చూసి పోలీసులు షాకయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. మొత్తానికి గాలయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Next Story

Most Viewed