అత్తారింటికి వెళ్లాల్సిన నవ వధువు ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?

by Mahesh |   ( Updated:2021-12-01 05:28:46.0  )
అత్తారింటికి వెళ్లాల్సిన నవ వధువు ఆత్మహత్య.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, ఏపీ బ్యూరో: కాళ్ల పారాణి ఇంకా ఆరనే లేదు. బంధువుల సందడితో ఇళ్లంతా కలకలలాడుతోంది. పెళ్లికి హాజరు కాని వారు వచ్చి నవ వధువును ఆశీర్వ దించేందుకు ఇంకా వస్తూనే ఉన్నారు. మరోవైపు కన్నతల్లిదండ్రులు నవ వధువును అత్తారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్తారింట్లో అడుగు పెట్టినప్పుడు తమ కూతురుకు ఎలాంటి లోటు రాకుండా ఉండేందుకు తండ్రి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్టినింట్లో తమ కుమార్తె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఇంకా ఏం కొనాలి.. ఏం పంపాలి అని ఆలోచనలో ఉన్నారు. ఇంతలో కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పెళ్లిసారెతో అత్తారింటికి పంపాల్సిన కుమార్తెను.. విగతజీవిగా శ్మశాన వాటికకు పంపడం చూసి ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

ఈ హృదయ విదారకర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బుక్కరాయసముద్రంలోని గ్రామ సచివాలయం-2లో పనిచేస్తున్న సుజనకు చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంకు చెందిన విశ్వనాథ్‌తో నవంబర్ 17న వివాహం జరిగింది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మేళతాళాల మధ్య.. వేదమంత్రాల నడుమ.. అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. పెళ్లి అనంతరం సుజన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. పదిరోజులుగా ఇక్కడే ఉంటుంది. పుట్టింటి నుంచే విధులకు హాజరవుతుంది. అత్తారింటికి పంపేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అత్తారింటికి వెళ్లేందుకు ఆమె వాయిదా వేస్తూ వచ్చింది. ఇంటిదగ్గర నుంచే డ్యూటీకి వెళ్లిన సుజన సోమవారం సాయంత్రం తిరిగి వచ్చేసింది.

అనంతరం బాత్‌రూమ్‌‌లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు నవ వధువును ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. అయితే తల్లిదండ్రులు అంటే సుజనకు విపరీతమైన ప్రేమ. తల్లిదండ్రులను ఎక్కడ వదిలి వెళ్లాల్సి వస్తుందన్న బెంగతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమను విడిచిపెట్టలేక తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తెను చూసుకుని విలపిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టిస్తుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Next Story