ఏడాదిగా ఎస్ఎల్ బీసీ సొరంగం పనులకు బ్రేక్

by Prasanna |
ఏడాదిగా ఎస్ఎల్ బీసీ సొరంగం పనులకు బ్రేక్
X

దిశ, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల కలల సౌధంగా భావించే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు(ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు) పట్ల పాలకుల చిత్తశుద్ధి చూస్తే ఎవరికైనా సిగ్గేయక మానదు. ఒకటి కాదు రెండు కాదు అక్షరాలా 15 ఏండ్లు గడిచిపోయాయి. అయినా ఇంతవరకు ఆ ప్రాజెక్టుకు అతీగతీ లేకుండా పోయింది. ‘నీళ్లు- నిధులు-నియామకాలు’ లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనూ ఆ ప్రాజెక్టు పట్ల చిన్నచూపే కొనసాగుతోంది. సాగునీటి రంగం విషయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు నుంచీ ఉమ్మడి పాలకులపైనే సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. కానీ, స్వయంగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఆరేండ్లు పూర్తయినా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పట్ల అదే చిన్నచూపు కంటిన్యూ అవుతోంది. గత 15 ఏండ్లుగా నత్తతో పోటీ పడుతున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుపై ‘దిశ’ ప్రత్యేక కథనం..

ప్రాజెక్టు స్వరూపం ఇదీ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005 సంవత్సరంలో శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) పనులను అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన 1983-84 కాలంలో శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ)తో పాటు వచ్చిందే కావడం గమనార్హం. ఎస్ఆర్బీసీ 1990 లోనే పూర్తి కాగా, ఎస్ఎల్బీసీ మాత్రం ఇంకా కొన..సాగుతూనేవుంది. 2010 సంవత్సరం నాటికి పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగు నీరు, 250 గ్రామాలు పైగా తాగునీరు అందుతుంది. మొదట ప్రాజెక్టు వ్యయం రూ.1,925 కోట్ల అంచనా విలువతో ప్రారంభంకాగా.. తర్వాత అది రూ.3,152.72 కోట్లు, అనంతరం రూ.4200 కోట్ల అంచనాకు చేరింది. ఈ వ్యయంతో 2020 అక్టోబరు వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది.

అన్నీ కుదిరితే.. రెండేళ్లకు పైగా సమయం..

ఎస్ఎల్‌బీసీ కాల్వను 43.930 కిలోమీటర్ల పొడవు సొరంగ మార్గంగా తవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 33 కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గాన్ని తవ్వారు. ఇంకా 10 కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గాన్ని తవ్వాల్సి ఉంది. అయితే తరచూ సాంకేతిక సమస్యలు, నిధుల లేమి, ఇతర సమస్యల కారణంగా పనులు నిలిచిపోతున్నాయి. పనులు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగు సార్లు విధించిన గడువు సైతం ముగిసిపోయింది. ఇదిలావుంటే.. సొరంగం పనుల్లో వినియోగిస్తున్న టన్నెల్ బోరింగ్ మిషన్లు నెల రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తే కేవలం అరకిలోమీటరు(500మీటర్లు) మాత్రమే తవ్వగలుగుతుంది. ఈ లెక్కన మిగిలిన 10 కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గాన్ని తవ్వేందుకు ఎటూ లేదన్న రెండేండ్లకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.

పూర్తయిన టన్నెల్-2 పనులు..

ఎల్ఎల్‌బీసీ పనులను టన్నెల్-1, టన్నెల్-2గా విభజించారు. టన్నెల్-1 మొత్తం 43 కిలోమీటర్లు కాగా, టన్నెల్-2 పొడవు 7.25 కిలోమీటర్లు. అయితే ఇప్పటికే టన్నెల్-2 పనులు పూర్తయ్యాయి. ఇంకా లైనింగ్ పనులు చేయాల్సి ఉంది. ఇందులో కేవలం 40 శాతం లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ఇక మిగిలిందంతా టన్నెల్-1కు సంబంధించిన పనులే కావడం గమనార్హం. అయితే టన్నెల్-1 పనులను రెండు వైపుల నుంచి చేస్తున్నారు. ఇందులో ఇన్ లెట్ నుంచి 14 కిలోమీటర్లు, ఔట్ లెట్ నుంచి 19 కిలోమీటర్ల సొరంగ మార్గం పనులు పూర్తయ్యాయి. ఇంకా 10 కిలోమీటర్లకు పైగా పనులు జరగాల్సి ఉంది.

పనుల్లో జాప్యంతో డిండికి గండి..

ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పనుల్లో జాప్యం వల్ల నల్లగొండ జిల్లాలో సాగు, తాగు నీటికి ప్రధాన ప్రాజెక్టుగా నిలిచే డిండి ప్రాజెక్టుపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. డిండి ప్రాజెక్టుకు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి నీటిని తీసుకురావాలని నిర్ణయించారు. దాని ఆధారంగానే డిండి ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులు ఏండ్లు గడుస్తున్నా ముందుకు సాగడం లేదు. దీంతో డిండి ప్రాజెక్టు డీపీఆర్ లో మార్పులు చేయించారు. ఆ తర్వాత పాలమూరు-రంగారెడ్డి ద్వారా తరలించే నీటిని కొంతమేర ఈ ప్రాజెక్టుకు ఉపయోగించాలని భావించారు. కానీ అదీ ముందుకు సాగకపోవడంతో అసలు డిండి ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి నీటిని తీసుకోవాలనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఫలితంగా అసలు డిండి ప్రాజెక్టుపైనే సందిగ్ధత ఏర్పడింది.

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా..

ఎస్ఎల్‌బీసీ పనుల విషయానికొస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి.. ప్రత్యేక రాష్ట్రంలో పరిస్థితికి పెద్దగా తేడా లేదనే చెప్పాలి. 2005 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. ఆయన మరణంతో ప్రాజెక్టుపై కొంత సందిగ్ధత ఏర్పడింది. కానీ తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.1925 కోట్ల నుంచి రూ.3వేల కోట్లకు పెంచారు. కానీ పనుల్లో పెద్దగా వేగం పుంజుకోలేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో వేగం పుంజుకుంటుందని అందరూ భావించారు. కానీ సీఎం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టు పనులను పక్కన పెట్టి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం పై దృష్టి సారించారు. దీంతో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే నల్లగొండ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కానీ సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టుపై చిన్నచూపు చూస్తున్నారు.

ఏడాదిగా నిలిచిపోయిన పనులు..

2010 సంవత్సరం నాటికి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పనుల గడువు పొడిగిస్తూ వస్తున్నారు. ఓ వైపు నిధుల లేమి.. మరోవైపు సాంకేతిక సమస్యల కారణంగా ఏడాది కాలంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికితోడు ఇన్‌లెట్ తవ్వకాల పనులను ఊట నీరు పెరగడం వల్ల ఆపేశారు. ప్రస్తుతం ఊట నీటిని తోడేందుకు సమయం సరిపోతోంది. ఔట్‌లెట్ వైపు నుంచి టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)లో సాంకేతిక సమస్య కారణంగా పనులు ఆగిపోయాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత అన్నీ అనుకూలిస్తే.. పనులు ప్రారంభం కావడానికి మూణ్నెళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికితోడు పెరిగిన అంచనా వ్యయం రూ.4200 కోట్లు అయితే.. ఇప్పటివరకు దాదాపు రూ.2500 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి.

దక్షిణ తెలంగాణపై చిన్నచూపు నిజమేనా..

ప్రస్తుతం సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందుగానే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుకు అడుగులు పడ్డాయి. కానీ సీఎం కేసీఆర్ ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను పూర్తిగా పక్కన పట్టేశారు. వాస్తవానికి ఉత్తర తెలంగాణతో పోల్చుకుంటే.. నల్లగొండ జిల్లాలో ఇటు తాగునీరు.. అటు సాగునీరు సమస్య తీవ్రంగా ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్లగొండ జిల్లాల ఫోరైడ్ రక్కసి మాములుగా ఉండదు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాలు అట్టుడికేవీ.. ఉమ్మడి పాలనలో ఏకంగా అప్పటి శాసనసభ స్పీకర్ నాదేండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమిటీ వేశారు. కమిటీ క్షేత్రస్థాయిలోనూ పర్యటించి ఫ్లోరైడ్ మహమ్మారి తీవ్రతను తెలుసుకుంది. అయినా ఫ్లోరైడ్ బాధలు నేటికీ కనుమరుగవ్వలేదు. ఆ సమయంలో విపక్షంలో ఉన్న ఇప్పటి సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాకు ఎప్పడు వచ్చినా ఫ్లోరైడ్ రక్కిసినే ఆధారంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించేవారు. కానీ ప్రస్తుతం ఆ పేరు ఎత్తేందుకు ఇష్టపడడం లేదు. ప్రధానంగా సాగునీటి వనరులపై ఉత్తర తెలంగాణ మీద పెట్టినంత దృష్టి దక్షిణ తెలంగాణ మీద పెట్టడం లేదనేది అక్షర సత్యం.

నోరు మెదపని పోరాటాల ఖిల్లా..

నల్లగొండ జిల్లా మొదటి నుంచి పోరాటాల ఖిల్లాగా పేరుగాంచింది. ప్రజాసమస్యలపై ఇక్కడికి వారికి చైతన్యంతో కాస్తంత ఎక్కువనే చెప్పాలి. దీనికితోడు కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కాస్తంత పోరాటాలు ఎక్కువగానే జరుగుతాయి. అయితే ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం నీటి పారుదల విషయంలో జరుగుతున్న అన్యాయంపై జిల్లా ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ప్రభావం ఎక్కువగా నాగర్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, నునావత్ రవీంద్రకుమార్ ల నేపథ్యమంతా కమ్యూనిజమే. వారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ప్రజాసమస్యలతోనే. కానీ వారి పరిస్థితుల కారణంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. నాటి నుంచి నేటి వరకు వారు ప్రజా సమస్యలపైన గానీ నీటి పారుదల విషయంలో గానీ మౌనం వహిస్తున్నారు. ఈ మౌనం అధికార పార్టీ అధినేతకు భయపడే అన్న విషయం స్పష్టమవుతోంది.

ఆలమట్టితో ఇప్పటికే తీరని నష్టం..

వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఇప్పటికే ఆలమట్టి ప్రాజెక్టు నిర్మాణంతో తీరని నష్టం జరిగింది. కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఆలమట్టి ప్రాజెక్టు కారణంగా నీటి రాక నిలిచిపోయింది. ఫలితంగా ఎడమకాల్వ ఆయకట్టులో వరికి బదులు వారంబంధీ విధానం అమలు, ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు ఆరేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయకట్టు పరిధిలో రైతులు బావులు, బోర్లు తవ్వుతున్నారు. నిజానికి ఆయకట్టు మొదటి జోన్‌లో నల్లగొండ, సూర్యాపేట, రెండో జోన్‌లో ఖమ్మం జిల్లా, మూడో జోన్‌లో కృష్ణాజిల్లాకు నీరు చేరుతుంది. అయితే మూడో జోన్‌లోని తిరువూరు వరకు నీరు చేరాలంటే.. 45 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు చేరాలంటే 30 టీఎంసీల నీరు సరిపోతుంది. కానీ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడం వల్ల 10 టీఎంసీల నీరు అటువైపే వెళుతుంది. దీంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని ఆయకట్టు ఎండిపోనుంది.

ప్రాజెక్టు స్వరూపం ఇదీ..

టన్నెల్-1 మొత్తం పొడవు : 43.930 కిలోమీటర్లు
అవుట్ లెట్ టన్నెల్ నుంచి తవ్వింది : 20.305 కిలోమీటర్లు
ఇన్ లెట్ టన్నెల్ నుంచి తవ్వింది : 13 కిలోమీటర్లు
ఇంకా తవ్వాల్సింది : 10.652 కిలోమీటర్లు
టన్నెల్-2 మొత్తం పొడవు: 7.25 కిలోమీటర్లు

Advertisement

Next Story