బ్రెజిల్‌లో మరణ మృదంగం.. కరోనాతో ఒక్కరోజే 3 వేల మందికి పైగా మృతి

by Anukaran |   ( Updated:2021-03-24 03:22:17.0  )
brazil corona deaths
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రెజిల్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. ఈ మహమ్మారి బారిన పడి ఒక్కరోజే (మంగళవారం) 3,251 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఈ స్థాయిలో మరణాలు సంభవించకపోవడం గమనార్హం. కొత్తగా నమోదైన మరణాలతో కలిపితే బ్రెజిల్‌లో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించినవారి సంఖ్య 3 లక్షల (2,98,843)కు చేరువలో ఉంది. అమెరికా తర్వాత కరోనా సోకి మరణించిన వారి సంఖ్య బ్రెజిల్‌లోనే ఎక్కువ. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 838 మంది కొవిడ్-19తో మరణించారు.

మంగళవారం నమోదైన మొత్తం మరణాల్లో ఒక్క సావోపో నగరంలోనే 1,021 మంది చనిపోయారని బ్రెజిల్ వైద్య శాఖ తెలిపింది. అంతేగాక దేశవ్యాప్తంగా కొత్త కేసుల పెరుగుదల కూడా ఎక్కువగానే ఉంది. మంగళవారం అక్కడ 84 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్యలో అమెరికా తర్వాత బ్రెజిల్ ఉంది.

ఇదిలాఉండగా.. దేశంలో కొవిడ్‌ను అరికట్టడంలో బోల్సొనోరా ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏడు రాష్ట్రాలలోని ఆస్ప్రతులలో ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా రోగులకు అందించే మందులు కూడా అందుబాటులో లేవని వైద్యరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. దేశంలో లాక్‌డౌన్ విధించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి విస్తరిస్తుందని.. ఇప్పటికైనా మేలుకుని దేశాన్ని కాపాడాలని కోరుతున్నారు. అయితే దేశంలో కొవిడ్ కేసులు, మరణాలు పెరుగుతున్నా అధ్యక్షుడు బొల్సొనోరో మాత్రం.. త్వరలోనే సాధారణ జీవితాన్ని చూడబోతున్నామని ప్రకటించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed