విధి ఆడిన వింత నాటకం.. పేరెంట్స్ అకాల మరణంతో అనాథైన బాలుడు

by Sridhar Babu |
విధి ఆడిన వింత నాటకం.. పేరెంట్స్ అకాల మరణంతో అనాథైన బాలుడు
X

దిశ, హుజురాబాద్ : విధి ఆడిన వింత నాటకంలో తల్లిదండ్రులు విగతజీవులుగా మారి కానరాని లోకలకు చేరిపోతే.. పసివాడైన పదకొండేళ్ల ఆ బాలుడు అనాథగా మిగిలిపోయాడు. హుజురాబాద్ మండలం ఇందిరానగర్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనను చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు స్థానికులు.

వివరాల ప్రకారం.. ఇందిరానగర్‌కు చెందిన నెల్లి స్వరూప(40) మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. హుజురాబాద్ పట్టణంలో జరిగే ఓ పార్టీ సమావేశానికి హాజరవుతున్న క్రమంలో రాజపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వారిని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న నెల్లి స్వరూప బుధవారం రాత్రి మరణించారు. స్వరూప భర్త ప్రభాకర్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.

వీరి సంతానం అయిన హర్షవర్దన్(11) తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయాడు. చిరుప్రాయంలోనే అమ్మానాన్నలకు దూరమైన ఆ చిన్నారిని చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆడుతూ పాడుతూ ఐదో తరగతి చదువుకుంటున్న అతని పరిస్థితి ఎలా.. అని సానుభూతిని చూపిస్తున్నారు. తెలిసీ తెలియని వయసులోనే తల్లిదండ్రులను కోల్పోవడం పలువురిని కలిచి వేసింది. ప్రస్తుతానికి హర్షవర్దన్‌ను అతని అమ్మమ్మ తిప్పరవేని సమ్మక్క చూసుకుంటానని చెప్తోంది.

అయితే ఆరు పదుల వయసులో ఉన్న సమ్మక్కకు హర్షవర్దన్ బాధ్యతలు అప్పగిస్తే మరింత భారం అవుతుందేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూలీ నాలి చేసుకునే హర్షవర్దన్‌ కుటుంబానికి జీవనాధారం కూడా ఏమీ లేదని గ్రామస్తులు తెలిపారు. అతనికి ఉన్నత చదువులు చదివించి జీవితాన్ని తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed