పవన్‌కు అవగాహన లేదు.. అతని గురించి మాట్లాడుకోవడమే తప్పు : బొత్స

by srinivas |
botsa satyanarayana
X

దిశ, ఏపీ బ్యూరో : ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సాంకేతిక అంశాలను ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ముందుకు సాగకుండా అన్నివిధాలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పేదల ఇంటి నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే టీడీపీ అడ్డుకట్టవేస్తోందని ఆరోపించారు.

విజయనగరం జిల్లాలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన రాజ్యాంగ బద్ధంగానే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందని వెల్లడించారు. ఇరవై ఏళ్ళ క్రితమే ప్రభుత్వ ఆస్తులు చంద్రబాబు అమ్మి ఇప్పుడున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆస్తులు విక్రయించటం అనేది సర్వసాధారణమైన అంశమని చెప్పుకొచ్చారు.

కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా..? గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే విపక్షాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి.?అని బొత్స ప్రశ్నించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా బొత్స అసహనం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయంపై అవగాహన లేదని విమర్శించారు. ఏ అంశంపైనా పరిపక్వత లేదన్నారు. పవన్ కళ్యాణ్ వంటి భాధ్యతారాహిత్యం గల వ్యక్తి గురించి మాట్లాడుకోవటమే తప్పు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed