నెల క్రితం భార్య… నేడు భర్త అదే పని..

by Sumithra |
నెల క్రితం భార్య… నేడు భర్త అదే పని..
X

దిశ, దుబ్బాక: ఆర్థిక ఇబ్బందులు తాళలేక నెల రోజుల క్రితం భార్య, నేడు భర్త చనిపోయిన విషాద ఘటన చెల్లాపూర్ వార్డులో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ 3వ వార్డులో సుంకోజి నర్సింహాచారి, దేవేంద్ర అనే భార్యాభర్తలు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. వీరికి ఇద్దరు కుమార్తెలు గాయత్రి, సుప్రియ ఉన్నారు. నర్సింహచారి కార్పెంటర్ గా పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత నెల 1న నర్సింహచారి భార్య దేవేంద్ర ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలతో కలిసి నర్సింహచారి దుబ్బాకలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

అయితే తన భార్య మృతి చెందిన సంఘటనతో మనోవేదనకు గురై సోమవారం రాత్రి చెల్లాపూర్ లో తన భార్య ఉరేసుకుని చనిపోయిన దూలానికే భర్త నర్సింహచారి కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు నెల రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరు బలవన్మరణానికి పాల్పడడంతో కుమార్తెలు గాయత్రి, సుప్రియలు అనాధలుగా మారారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story